కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగదు, సంక్షోభం తప్పదు: కొండా సురేఖ
State
oi-Pratapreddy
By Pratap
|
కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం 2014 వరకు కొనసాగబోదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికలపై కాంగ్రెసు నాయకులే భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆమె చెప్పారు.
కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి అందరూ అశ్చర్యపోయే విధంగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్కు మెజార్టీ తగ్గించేందుకు కాంగ్రెసు పార్టీ పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తుందని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలు విని మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.