1400 కి. మీ. ప్రయాణించి మహిళా ప్రొఫెసర్ ను దారుణంగా చంపిన జంట.. సంచలన విషయాలు వెలుగులోకి..
దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. పశ్చిమ్ బెంగాల్ కు చెందిన దంపతులు దాదాపు 1400 కి. మీ. ప్రయాణించి దిల్లీ చేరుకుని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మహిళా ప్రొఫెసర్ ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. అయితే ఈ ఘటన జరిగిన మూడు రోజుల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఆ దంపతుల్ని అరెస్ట్ చేశారు. మరి ఆ జంట చదువులు చెప్పే ఆ మహిళా ప్రొఫెసర్ ను ఎందుకు కిరాతకంగా హతమార్చింది..? అందుకు గల కారణాలు ఏంటి..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేబోస్మితా పాల్ దిల్లీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తూర్పు దిల్లీలోని వసుంధర్ ఎన్ క్లేవ్ లోని సత్యం అపార్ట్ మెంట్స్ లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. అయితే పశ్చిమ్ బెంగాల్ కు చెందిన ఒక దంపతులు ఒక పాత ఆస్తి వివాదం కారణంగా దేబోస్మితాను హతమార్చాలని ప్లాన్ చేసుకున్నారు. అలా తమ చిన్నారితో కలిసి బెంగాల్ నుంచి దాదాపు 1400 కి. మీ. ప్రయాణించి దిల్లీ చేరుకున్నారు.
జూన్ 3న సదరు భార్యాభర్తలు మాస్కులు ధరించి దేబోస్మితా ఉంటున్న సత్యం అపార్ట్‌మెంట్స్ ఫ్లాట్ కు వెళ్లారు. ఇక చిన్నారిని బయటే ఉంచి ఆ దంపతులు లోపలికి ప్రవేశించారు. దేబోస్మితా తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె మణికట్టు నరాలు కట్ చేశారు. ఆ తర్వాత ఫ్లాట్ కు బయట నుండి తాళం వేసి పారిపోయారు.

అయితే అదే సమయంలో దేబోస్మితా సోదరి దేవరతి పదే పదే ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అనుమానం వచ్చి ప్లాట్ దగ్గరికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దేబోస్మితా శవమై కనిపించి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న న్యూ అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లాట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫూటేజ్ ద్వారా వారు ప్రయాణించిన ప్రైవేట్ క్యాబ్ వివరాలను సేకరించారు. చివరకు బెంగాల్ లోని వర్ధమాన్ లో నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications