ఉదయం 6 గంటలకే ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఏమన్నారంటే?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న మంచి స్నేహబంధం గురించి ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇటీవలే ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో కూడా వీరిద్దరూ ప్రత్యేకంగా కలుసుకున్నారు. వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ట్రంప్ వదులుకోరు. ఈ నేపథ్యంలో ఇండియాలో నియమితులైన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఓ అత్యంత ఆసక్తికరమైన, సరదా సంఘటనను పంచుకున్నారు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన 'యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్' లీడర్‌షిప్ సమ్మిట్‌లో సెర్గియో గోర్ ఈ ముచ్చటను వెల్లడించారు. గత ఏప్రిల్ నెలలో ఫ్లోరిడాలోని మయామి నగరంలో జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ స్టేజ్ వెనుక కూర్చుని ఉన్నారని గోర్ గుర్తు చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్‌కు తన ఆప్తమిత్రుడు నరేంద్ర మోదీతో మాట్లాడాలనే బలమైన కోరిక కలిగిందని, వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ కలపాల్సిందిగా తనను ఆదేశించారని సెర్గియో గోర్ పేర్కొన్నారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయమన్న సమయంలో ఇండియాలో అప్పటికే తెల్లవారుజామున 6 గంటలు అవుతోందని సెర్గియో గోర్ డొనాల్డ్ ట్రంప్‌కు గుర్తు చేశారు. ఆ మాట వినగానే డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో నవ్వుతూ.. "ప్రధాని మోదీ ఇప్పటికే నిద్ర లేచే ఉంటారు, ఆయన అస్సలు పడుకోరు. ఆయన కూడా సరిగ్గా నా లాంటి వారే. మేము ఇద్దరం అస్సలు నిద్రపోము" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే సెర్గియో గోర్ ఇండియాకు ఫోన్ కలపగా.. ఇద్దరు అగ్రనేతల మధ్య చాలా సేపు ఆసక్తికరమైన సంభాషణ సాగింది.
ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇరు దేశాల భవిష్యత్తు పర్యటనల గురించి కూడా కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది మయామిలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని ఆయన తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఇండియాలో పర్యటించనున్నట్లు సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
US trusts India says US ambassador Sergio Gor; Talks about investments, high level visits including 2nd visit of Marco Rubio to India this year.
— Sidhant Sibal (@sidhant) June 30, 2026
Vdo ctsy: USISPF pic.twitter.com/RJ3HhoLnVS
దీంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఏడాదిలోనే మరోసారి ఇండియాలో పర్యటించనున్నారని సెర్గియో గోర్ వెల్లడించారు. మార్కో రూబియో ఈ ఏడాది మే నెలలో అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా భారత్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆయన భారత పర్యటనకు రానుండటం ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు అద్ధం పడుతోంది.












Click it and Unblock the Notifications