"బుల్లిరాజు" బాగా కాస్ట్లీ అయ్యాడా.. రోజుకి లక్ష రెమ్యూనరేషన్ ??
బుల్లిరాజు.. అలియాస్ మాస్టర్ రేవంత్.. విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఎవరికి వారు తమ పాత్రలతో మెప్పించినప్పటికీ... బుల్లిరాజు మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు.
సినిమాలో వెంకటేష్ కుమారుడిగా కనిపించిన బుల్లిరాజు పాత్ర నిడివి పెద్దగా లేకపోయినా, ప్రతి సీన్‌లో తన సహజమైన నటన, అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా... "మా నాన్నంటే నాకు ప్రాణం... ఎవరైనా ఏమైనా అన్నారో..." అంటూ బీప్ సౌండ్స్‌తో వచ్చే డైలాగ్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో కూడా ఈ సీన్ భారీగా వైరల్ అయింది. మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోలతో బుల్లిరాజు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు", నవీన్ పొలిశెట్టి "అనగనగా ఒక రాజు" చిత్రాలతో మళ్లీ హిట్స్ అందుకున్నాడు. బుడ్డోడి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, సహజమైన నటన కారణంగా ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. గతంలో మాస్టర్ భరత్, తేజ సజ్జా, బేబీ షామిలి వంటి చైల్డ్ ఆర్టిస్టులు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు అదే జాబితాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పేరు మాస్టర్ రేవంత్.
రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు.. రెమ్యూనరేషన్ షాక్
టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మాస్టర్ రేవంత్ రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండే సినిమాలకు రోజుకు సుమారు రూ.1 లక్ష తీసుకుంటుండగా, తక్కువ రోజుల షూటింగ్ ఉండే ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఒక చైల్డ్ ఆర్టిస్టుకు రోజువారీ ప్రాతిపదికన ఈ స్థాయి రెమ్యూనరేషన్ చాలా పెద్ద మొత్తంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
చైల్డ్ ఆర్టిస్టులుగా స్టార్‌డమ్ సాధించడం ఒక ఎత్తయితే... ఆ క్రేజ్‌ను ఎక్కువకాలం నిలబెట్టుకోవడం మరో ఎత్తు. గతంలో మాస్టర్ భరత్ వరుస సినిమాలతో టాలీవుడ్‌ను ఊపేసినప్పటికీ, వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బుల్లిరాజు కూడా ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నప్పటికీ... రెమ్యూనరేషన్ విషయంలో మరీ ఎక్కువ డిమాండ్ చేస్తే చిన్న నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథలు, సరైన పాత్రలను ఎంపిక చేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో అతను మరింత బిజీ ఆర్టిస్టుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications