రాయలసీమలో మరో కొత్త బంగారు గనులు.. బంగారం పంట పండుతుంది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంగారు గనుల రాష్ట్రంగా మారుతుంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో బంగారు గనుల అన్వేషణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరి మరియు చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించి తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఇప్పటికే ఆంధ్రా మేడ్ బంగారం బిస్కెట్ లు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి.
సత్యసాయి జిల్లాలో బంగారుగనులు
ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ బంగారు గనులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. ఎన్‌పీకుంట మండలం జౌకల, రామగిరి ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వం పరిశోధనలను తీవ్రం చేసింది. జౌకల ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకుల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం . ఈ బ్లాకుల్లో నాలుగు దశల్లో విస్తృత పరిశోధనలు చేపట్టనున్నారు.

కర్ణాటకలోని కోలార్ గ్రీన్‌స్టోన్ బెల్ట్ లా నిక్షేపాలు
ఆరు ప్రైవేట్ ఏజెన్సీలు ఈ పనులను చేపట్టి నివేదిక సమర్పించనున్నాయి. పరిశోధనలు పూర్తి కాగానే నిక్షేపాల స్థాయి, నాణ్యతపై స్పష్టత వచ్చాక మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ ప్రాంతం కర్ణాటకలోని కోలార్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌ను పోలి ఉండటం ఇక్కడ ప్రధాన విశేషంగా చెప్తున్నారు. ఇక్కడ 2015లో మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ జౌకల ప్రాంతంలో పరిశోధనలు చేపట్టి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించింది.
అక్కడ 5,560 హెక్టార్లలో విస్తృత అన్వేషణ
2022లో జీ4 దశలో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆ పనులను మళ్లీ ప్రారంభించింది. జౌకల వెలిగల్లు గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లోని కొత్తపల్లి బ్లాక్‌తో సహా 5,560 హెక్టార్లలో విస్తృత అన్వేషణ జరగనుంది. రామగిరి, రొద్దం ప్రాంతాల్లో కూడా బంగారు గనుల సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ గనులను వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనలు ఉన్నాయి.
ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరవనున్న బంగారు గనులు
రాయలసీమలో బంగారు గనులు ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరుస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో కూడా గనులు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కనుగొన్న నిక్షేపాలు రాష్ట్ర ఖనిజ సంపదను మరింత పెంచుతాయి. ఈ బంగారు గనుల ప్రాజెక్ట్ లు ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మారిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications