Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తండా’ షష్ఠిపూర్తి!
అదొక ఎండ తీవ్రంగా ఉన్న ఉపాధి హామీ పని ప్రదేశం. చేతుల్లో పారలు, గడ్డపారలు.. గుంతలు తవ్వడం, మట్టి మోయడం.. సాధారణంగా ఎక్కడైనా కనిపించే అలసటతో కూడిన దృశ్యం అది. కానీ, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఆ కష్ట జీవులంతా కలిసి ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఆవిష్కరించారు. చెమట చుక్కల మధ్య ఆత్మీయతను పండించి, తోటి కూలీల గుండెలు హత్తుకునేలా ఒక వినూత్న వేడుకకు శ్రీకారం చుట్టారు. నిరుపేద శ్రామికుల పెద్ద మనసుకు నిదర్శనంగా నిలిచిన ఈ కథనం ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వులు పూయిస్తోంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పారాజుపల్లి గ్రామ శివారు పుట్లపాట్ తండాకు చెందిన వృద్ధ దంపతులు భూక్య కస్నా, అమ్మి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు. రోజువారీ పొట్టకూటి కోసం ఈ వయసులోనూ ఉపాధి హామీ పనులకు వస్తున్నారు. అయితే, వీరిద్దరి వైవాహిక బంధం విజయవంతంగా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే సుదీర్ఘమైన ఐదు పదుల గోల్డెన్ జూబ్లీ ప్రయాణం అన్నమాట. ఈ అరుదైన, పవిత్రమైన సందర్భం గురించి తెలుసుకున్న తోటి ఉపాధి హామీ కూలీలు మురిసిపోయారు. తమ మధ్యే తిరుగుతున్న ఈ ముసలాళ్లకు పిల్లలు, బంధువులు చేయకపోయినా.. తామంతా కలిసి ఎలాగైనా ఘనంగా 'షష్ఠిపూర్తి' వేడుక చేయాలని మనసులోనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు.

పని ప్రదేశంలోనే 'పెళ్లి' సందడి..
అనుకున్నదే తడవుగా ఉపాధి కూలీలంతా ఆ రోజు పనులన్నీ చకచకా పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఏ విధమైన హంగూ ఆర్భాటాలు లేకపోయినా.. అక్కడికక్కడే ప్రకృతి సాక్షిగా, సాంప్రదాయ పద్ధతిలో ఆ వృద్ధ దంపతులకు మళ్లీ పెళ్లి జరిపించారు. పూల దండలు తెచ్చి నూతన వధూవరుల్లా ఆ వృద్ధ దంపతులిద్దరినీ నిలబెట్టారు. వారు ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులతో దండలు మార్చుకుంటుంటే... తోటి కూలీలు చప్పట్లతో, కేరింతలతో ఆ ప్రాంతాన్ని పెళ్లి ఇల్లా మార్చేశారు. కొత్త పెళ్లికూతురు, పెళ్లికొడుకును కాసేపు ఆటపట్టిస్తూ నవ్వులు పూయించారు.
50 ఏళ్ల వైవాహిక బంధం.. ఉపాధి హామీ సాక్షిగా షష్ఠిపూర్తి వేడుక.. కొత్త పెళ్ళికొడుకును ఆటపట్టించిన తోటి కూలీలు! #Marriage #Mahabubabad #Telangana #ViralWatch #OITelugu pic.twitter.com/C2foQXa6Ap
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2026
ఈ అపురూప వేడుకను చూసి ముగ్ధులైన స్థానిక యువకులు, గ్రామస్తులు కూలీలందరికీ స్వీట్లు, చాక్లెట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక పెళ్లి ముగిశాక అసలు సిసలు హంగామా మొదలైంది. డప్పు చప్పుళ్లకు వృద్ధ దంపతులతో కలిసి ఉపాధి హామీ కూలీలు వేసిన తీన్మార్ స్టెప్పులు ఆ ప్రాంతంలో రచ్చ లేపాయి. తమ వయసును, కష్టాన్ని పూర్తిగా మరిచిపోయి ఆ వృద్ధ దంపతులు కూడా తోటి కూలీలతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేయడం అక్కడ ఉన్న వారి కళ్లల్లో ఆనంద బాష్పాలు తెప్పించింది.
నెటిజన్లను ఫిదా చేస్తున్న 'పెద్ద మనసు'
ప్రస్తుతం ఈ వినూత్న షష్ఠిపూర్తి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. డబ్బుతో కొనే విలాసవంతమైన వేడుకల కంటే.. ఈ నిరుపేద కూలీలు చూపించిన ఆత్మీయత ఎంతో గొప్పదని నెటిజన్లు కొనియాడారు. తోటి శ్రామికుల పెద్ద మనసును, వారి సృజనాత్మకతను మనసారా అభినందిస్తూ... ఆ వృద్ధ దంపతులకు "శతమానం భవతి" అంటూ సోషల్ మీడియా వేదికగా వేల సంఖ్యలో దీవెనలు అందిస్తున్నారు.














Click it and Unblock the Notifications