తెలంగాణలో చిరంజీవి పార్టీ గతే టిడిపికి పడుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ విభజించి పాలించే విధానం అమలవుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానికి లేఖ రాయకుండా తెలంగాణ ఎలా వస్తుందని ఆయన అడిగారు. చిదంబరానికి లేఖ రాయాల్సిన అవసరం లేదని పార్టీ తెలంగాణ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారని, లేఖ రాయకుండా తెలంగాణ సాధించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. పార్టీలోని విభజించి పాలించే పద్ధతి వల్లనే తాను పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై గానీ, ఆ నివేదిక ఎనిమిదో అధ్యాయంపై గానీ పార్టీలో చర్చించలేదని, కనీసం తెలంగాణ ఫోరం కూడా చర్చించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.