గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ హనీ పాప.. తాజాగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్ష్ ఔలఖ్ అనే వ్యక్తితో మెహ్రీన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన శైల్ ప్రాంతంలో ఏప్రిల్ 26న వీరి వివాహం వైభవంగా జరిగింది.
అర్ష్ ఔలఖ్‌తో ఏడడుగులు.. సిక్కు సంప్రదాయంలో పెళ్లి
మెహ్రీన్ తన వివాహాన్ని చాలా ప్రైవేట్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకోవడం గమనార్హం. సిక్కు సంప్రదాయం ప్రకారం 'ఆనంద్ కరాజ్' పద్ధతిలో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "26.04.26 #ArshDiMehr" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లేత గులాబీ రంగు లెహంగాలో మెహ్రీన్ దేవకన్యలా మెరిసిపోతుండగా.. అర్ష్ గులాబీ రంగు షేర్వాణీలో హుందాగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు "నిజంగా ఇది ఒక అద్భుతమైన ఫెయిరీ టేల్ వెడ్డింగ్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎవరీ అర్ష్ ఔలఖ్?
మెహ్రీన్ భర్త అర్ష్ ఔలఖ్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా సమాచారం లేదు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ప్రైవేట్‌గా ఉంది. అయితే ఆయన బయోలో 'కార్లు, ప్రయాణాలు, క్రీడలు, నెట్‌ఫ్లిక్స్.. ఒక కలల జీవితం' అని రాసి ఉంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది, కానీ ఎక్కడా ఈ విషయాన్ని బయటపెట్టకుండా నేరుగా పెళ్లితోనే అభిమానుల ముందుకు వచ్చారు.
నాలుగేళ్ల క్రితం రాజకీయ నాయకుడితో బ్రేకప్
మెహ్రీన్ పిర్జాదా గతంలో 2021లో హర్యానా బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు ప్రేమలో ఉన్న వీరు.. జైపూర్‌లో ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నిశ్చితార్థం జరిగిన 4 నెలలకే ఆ బంధాన్ని తెంచుకుంటున్నట్లు మెహ్రీన్ ప్రకటించింది. అప్పటి నుంచి తన కెరీర్ మీద దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అర్ష్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
సినిమా సెలబ్రిటీల శుభాకాంక్షలు
మెహ్రీన్ పెళ్లి వార్త తెలియగానే టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్, హన్సిక మోత్వాని, శ్రీనిధి శెట్టి, నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, రాహుల్ వైద్య వంటి ప్రముఖులు ఈ జంటకు వైవాహిక జీవితం బాగుండాలని ఆకాంక్షించారు.
మెహ్రీన్ సినీ ప్రస్థానం
పంజాబ్‌లో జన్మించిన మెహ్రీన్, 2016లో నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'ఎఫ్2' సినిమాలో 'హనీ ఈజ్ బెస్ట్' అంటూ ఆమె చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె కన్నడ సినిమా 'నీ సిగోవారేగు'తో మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications