కూటమి ప్రభంజనంలోనూ బొత్స మార్క్ విజయం.. తెరవెనుక అనూష వ్యూహమే బలమా?
రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి బలంగా ఉన్న సమయంలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన రాజకీయ సంకేతాలిచ్చాయి. ముఖ్యంగా గరివిడి,గుర్ల మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షం సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లోనూ ఈ రెండు మండలాల్లో పార్టీ తన పట్టును నిలబెట్టుకోవడం వెనుక సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవం ఒక కారణమైతే.. క్షేత్రస్థాయిలో ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనూష చేసిన ప్రయత్నాలు మరో కీలక అంశంగా కనిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యులను బరిలోకి దించి.. ప్రత్యర్థులకు సవాల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లాపై బొత్స సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాల్లో ఏ ఒక్కటీ ప్రత్యర్థులకు ఏకగ్రీవం కాకుండా చూడటంతో పాటు, పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బొత్స కుటుంబ సభ్యులే ఎన్నికల బరిలోకి దిగడం ఈ పోరుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం గరివిడి. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తన కోడలు కిమిడి సంధ్యను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టగా, బొత్స కుటుంబం తరఫున బొత్స పూజిత పోటీ చేశారు. హోరాహోరీగా సాగుతుందని భావించిన ఈ పోరులో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పూజిత ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు. అంతేకాదు, గరివిడి మండలంలోని మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కూడా వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో మండల పరిషత్‌పై పార్టీ పట్టు నిలుపుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యురాలికి ఎదురైన ఓటమి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గుర్లలోనూ బొత్స కుటుంబానికి విజయఢంకా
గరివిడితో పాటు గుర్ల మండలంలోనూ వైఎస్సార్సీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. గుర్ల జెడ్పీటీసీ స్థానానికి బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి పోటీ చేసి విజయం సాధించారు. తొలి రౌండ్ల నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఆమె ప్రత్యర్థి అభ్యర్థిపై పైచేయి సాధించారు. మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను కూడా వైఎస్సార్సీపీ దక్కించుకోవడంతో గుర్ల మండల పరిషత్‌పై పార్టీ ఆధిపత్యం కొనసాగింది.గరివిడి, గుర్ల ఫలితాలు కేవలం ఇద్దరు అభ్యర్థుల విజయాలుగానే కాకుండా.. ఆయా ప్రాంతాల్లో పార్టీకి ఉన్న స్థానిక బలాన్ని, కేడర్ సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గతంలో పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, స్థానికంగా నేతలు, కార్యకర్తలు ప్రజలతో కొనసాగించిన సంబంధాలు కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెర వెనుక అనూష గ్రౌండ్‌వర్క్..కేడర్‌కు కొత్త ఉత్సాహం
ఈ విజయాల వెనుక బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవంతో పాటు ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనూష చేసిన క్షేత్రస్థాయి ప్రయత్నాలు కూడా కీలకంగా నిలిచినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె నిర్మించుకున్న కేడర్ నెట్‌వర్క్ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రామాల్లో పర్యటించడం,మహిళా కార్యకర్తలను సమన్వయం చేయడం,యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై అనూష ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా ఎన్నికల బరిలో నిలబడేలా వారిలో ధైర్యాన్ని నింపడం ఆమె ప్రయత్నాల్లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. గరివిడిలో పూజిత,గుర్లలో వెంకటలక్ష్మి విజయాలకు ఈ క్షేత్రస్థాయి సమన్వయం కూడా తోడ్పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బొండపల్లిలో ఓటమి..అయినా అనూష పోరాటం చర్చనీయాంశమే
మరోవైపు,చీపురుపల్లి ప్రాంతంలో పార్టీకి బలం చేకూర్చిన అనూష స్వయంగా మాత్రం గజపతినగరం పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది.అక్కడి రాజకీయ సమీకరణాలు ఆమెకు సవాలుగా మారాయి.అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకత్వం ప్రభావం, పార్టీ మారిన మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను పాత్ర,బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు సంబంధించిన కుల సమీకరణాలు ఎన్నికల పోరును మరింత సంక్లిష్టం చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో అనూష స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, ఆమె ఓటమిని మాత్రమే ఈ ఎన్నికలతో ముడిపెట్టి చూడలేమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవైపు పార్టీ అభ్యర్థుల విజయాల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే,మరోవైపు తన నియోజకవర్గం కాని ప్రాంతంలో బలమైన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఆమెకు భవిష్యత్తులో ఉపయోగపడే అనుభవంగా మారవచ్చనే విశ్లేషణలు మొదలయ్యాయి..












Click it and Unblock the Notifications
