వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?
చాలామంది తాము బ్రతికి ఉండగానే ఆస్తి పంపకాల గురించి మాట్లాడటం అశుభమని భావిస్తుంటారు. మరికొందరు "నా తర్వాత ఎలాగూ నా పిల్లలకే కదా చెందేది" అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, చట్టం దృష్టిలో 'వీలునామా' లేని ఆస్తి పంపిణీ అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఒక వ్యక్తి తన ఆస్తులకు సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, దానిని చట్టపరంగా "ఇంటెస్టేట్" (Intestate) మరణంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
హిందూ వారసత్వ చట్టం, 1956లోని సెక్షన్ 8 ప్రకారం.. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తులు ఆ చట్టంలోని షెడ్యూల్ ప్రకారం వారసులకు సంక్రమిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారనుకుందాం. ఆ వ్యక్తి వీలునామా రాయకపోతే, అతని ఆస్తి మొత్తం ఈ ముగ్గురికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది. అంటే భార్యకు 1/3, కుమారుడికి 1/3, కుమార్తెకు 1/3 వంతు వాటా చట్టబద్ధంగా లభిస్తుంది.

వీలునామా రాయడం ఎలా? అది ఎంతవరకు చెల్లుతుంది?
భారత వారసత్వ చట్టం, 1925 ప్రకారం, ప్రతి వ్యక్తికి తన సంపాదనను తనకు నచ్చిన వారికి ఇచ్చే పూర్తి హక్కు ఉంటుంది.
- ఎవరికి ఇవ్వచ్చు?: కేవలం కుటుంబ సభ్యులకే కాకుండా, అపరిచితులకు లేదా స్వచ్ఛంద సంస్థలకు (Trusts) కూడా ఆస్తిని రాసివ్వవచ్చు.
- నిబంధనలు: వీలునామా చెల్లుబాటు కావాలంటే దానిపై సదరు వ్యక్తి సంతకం చేయాలి. అలాగే, కనీసం ఇద్దరు సాక్షులు (Witnesses) సంతకం చేయడం తప్పనిసరి.
- సాక్షుల పాత్ర: సాక్షులు వీలునామాలో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారు కేవలం ఆ వ్యక్తి సమక్షంలోనే సంతకం చేశారని ధృవీకరిస్తే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్ తప్పనిసరా? తెల్ల కాగితంపై రాయవచ్చా?
చాలామంది వీలునామా అంటే ఏదో పెద్ద బాండ్ పేపర్లు ఉండాలని భ్రమపడుతుంటారు. కానీ వాస్తవానికి వీలునామాను సాధారణ తెల్ల కాగితంపై కూడా రాసుకోవచ్చు. స్టాంపు పేపర్ ఉండాలన్న నిబంధన లేదు. వీలునామాను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండాలన్నా, కోర్టులో అది బలమైన సాక్ష్యంగా నిలవాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ముందస్తు ప్లానింగ్ ఎందుకు ముఖ్యం?
మనం సంపాదించిన ఆస్తి మన తర్వాత మనకి ఇష్టమైన వారికి, లేదా మన అవసరాల్లో తోడున్న వారికి దక్కాలని కోరుకుంటే వీలునామా ఒక్కటే మార్గం. వీలునామా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అప్పుడు మీరు ఎవరికైతే ఎక్కువ వాటా ఇవ్వాలని అనుకున్నారో లేదా ఎవరికైతే ఇవ్వకూడదు అనుకున్నారో.. ఆ నిర్ణయాలకు తావుండదు. అందుకే, ఆర్థిక క్రమశిక్షణలో ఆస్తులు సంపాదించడమే కాదు, వాటిని పక్కాగా వారసులకు అందించేలా 'వీలునామా' రాసుకోవడం కూడా ఒక భాగమేనని గుర్తుంచుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Oneindia Telugu అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు. మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.












Click it and Unblock the Notifications