ఏపీ ప్రజలకు చంద్రబాబు సూపర్ న్యూస్.. ఆగస్ట్ నుండి మీ ఆరోగ్యం కోసం సంజీవని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు వైద్య రంగానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీలో కర్నూలు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెల నుండి సంజీవిని కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సంజీవని కార్యక్రమంతో అన్ని ఆసుపత్రులు, ఏఎన్ఎం ల నుండి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకు అందరూ ఒకే నెట్వర్క్ కిందకు వస్తారని ఆయన పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో సంజీవని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా ఆస్పరి పిహెచ్సిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ తో, నచ్చిన ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో వైద్యులను సంప్రదించవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆలూరు, ఆస్పరి ప్రజలకు రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా వైద్య సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రతీ ఒక్కరి ఆరోగ్య చరిత్ర అందరికీ అందుబాటులో
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌరుని ఆరోగ్య వివరాలను ప్రభుత్వం సేకరించి భద్రంగా ఉంచుతుందని చంద్రబాబు తెలిపారు. పేషెంట్ యొక్క ఆరోగ్య వివరాలను ఆధార్ నెంబర్ చెప్పినా సరే వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర ఏ ఆసుపత్రిలో వైద్యులైన చూడవచ్చని సీఎం వివరించారు.
ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం ఆరోగ్యకరమైన కుటుంబాలు
రాష్ట్రంలో 80 లక్షల మందికి బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు, ఆహారపు అలవాట్లు జీవన శైలి మార్పుల కారణంగానే ఇలా అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉండాలని, ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో కృత్రిమ మేధ డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం
పెరుగుతున్న వ్యాధులు ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో కృత్రిమ మేధ డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ఏఐ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని, ఆహార సలహాలు కూడా ఏ ఐ ద్వారా అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications