మరో రెండేళ్లు సుప్తావస్థలో తెలంగాణ, రెండో ఎస్సార్సీయే మార్గం?
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి జాప్యం చేయనున్నట్టుగా తెలుస్తోంది. 2009లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, నేతల రాజీనామాల కారణంగా డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం కారణంగా శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం, వైయస్ జగన్ పార్టీని వీడి సొంత కుంపటి ఏర్పాటు చేసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ స్థితిలో ఏ ఒక్క ప్రాంతానికో లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో పార్టీ తుడిచి పెట్టుకు పోయే పరిస్థితి ఉన్నందున కేంద్రం మరో దారిలో వెళ్లనుందని రాజకీయ పరిశీలకులు భావించారు.
అదే సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని పార్టీ సమావేశాలలో పార్టీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్న బుందేల్ ఖండ్, హరిత ప్రదేశ్, పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీని ఆమోదించింది. ఉత్తర ప్రదేశ్ విషయంలో రెండో ఎస్సార్సీకి ఆమోదం తెలిపిన కాంగ్రెసు ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కూడా రెండో ఎస్సార్సీనే వేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చక్కబర్చాలంటే కేంద్రం కొద్ది కాలం రెండో ఎస్సార్సీ వైపు చూడక తప్పదంటున్నారు. అయితే రెండో ఎస్సార్సీకి సీమాంధ్ర నేతలు ఒప్పుకున్నప్పటికీ, తెలంగాణ నేతలు ససేమీరా అంటారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెసు నేతలు ఉత్తర ప్రదేశ్‌కు, ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధం లేదని, రాష్ట్రంలో రెండో ఎస్సార్సీ వేసే యోచనే లేదని చెప్పుకొస్తున్నారు. మరోవైపు జూన్ రెండోవారంలోపు తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.