వైయస్ జగన్‌కు చంద్రబాబు సవాల్: అవిశ్వాసానికి రావాలని పిలుపు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తాము నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని, ఇప్పుడు ప్రతిపాదించడానికి వెనకాడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుపై తిరుగులేని పోరాటం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. సవాళ్లు విసురుతున్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. తప్పకుండా తాము సందర్భం వచ్చినప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. ఒకరితో పెళ్లి చేసుకుని మరొరకితో కాపురం చేస్తున్నారని, ఇది విలువలు లేని రాజకీయాలకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అవకాశవాద రాజకీయమని ఆయన అన్నారు.
రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నామని చెప్పిన వైయస్ జగన్ వ్యాఖ్యను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు పార్టీ విషవృక్షమని, ఆ విషవృక్షం కొమ్మనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైయస్ జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు గుండెల్లో నిద్రపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన అన్నారు. సామాజిక మార్పు తెస్తానని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఏ సామాజిక మార్పు తెచ్చారో చెప్పాలని ఆయన అన్నారు. పలు పార్టీలు వచ్చాయని, అవేవి నిలబడలేకపోయాయని, తెలుగదేశం పార్టీ మాత్రమే నిలబడిందని, తెలుగుదేశం మాత్రమే నిలబడుతుందని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ అని, ప్రజాసమస్యలపై అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. ఓ వైపు జగన్ బిజెపితో చర్చలు జరుపుతూ మరోవైపు కాంగ్రెసు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టేవారు కారని ఆయన అన్నారు. పదవి రాలేదని పార్టీ పెట్టిన జగన్ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దోచుకున్నదని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న అన్ని సమస్యలకు కారణం వైయస్సార్ విధానాలే కారణమని, దానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చేతగాని తనం తోడైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications