క్లిష్ట సమయంలో ముందుకు నడిపించిన ఘనత బాబుదే: బాలకృష్ణ

తాను నటించిన పాత్రల కష్టనష్టాలను జీర్ణం చేసుకుని, ప్రజల ప్రోత్సహంతో, అభిమానంతో స్వర్గీయ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించారని, తెలుగుజాతిని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కాంగ్రెసును తొమ్మిది నెలల కాలంలో ఓడించారని బాలకృష్ణ అన్నారు. ఎన్టీ రామారావు ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఆయన అన్నారు. ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామరావుదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఐటి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెచ్చారని ఆయన అన్నారు. అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని, ముఖ్యమంత్రి ఉన్నారా, లేరా అనిపిస్తోందని, ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని ఆయన అన్నారు.
సముద్ర తీరాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని, సెజ్ పేరుతో దాన్ని కట్టబెట్టారని, అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ఆయన విమర్శించారు. అన్యాయం చేయడం నేరమైతే, అన్యాయాన్ని చూస్తూ మిన్నకుండడం మరింత నేరమని ఆయన అన్నారు. మనమంతా ప్రభుత్వంపై తిరగబడి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించారని ఆయన చెప్పారు. యువత, విద్యార్థులకు ప్రాముఖ్యం ఇచ్చి, వారితో కలిసి మనం కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించి, పైకి తేవడం మన ధర్మమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ మనుగడ సాగించాలంటే భేదభావాలు లేకుండా పనిచేయాలని, అప్పుడే ఎన్టీఆర్ ఆశయాలను సాధించగలుగుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications