చిరంజీవి నాకు పోటీ కాదు, నా టార్గెట్ నాది: బొత్స సత్యనారాయణ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమన్వయంతో వెళతానన్నారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గొప్ప అయితే రాష్ట్రస్థాయి పార్టీలో తాను గొప్ప అని చెప్పారు. రాష్ట్రంలో తాను రెండో అధికార కేంద్రంగా ఉంటున్నానన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. జోడు పదవులపై పార్టీ ఏ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. జగన్‌తో సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలను ప్రతిపక్షాలుగానే భావిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు రిఫరెండం కాదని అయితే వాటి ఫలితాలపై విశ్లేషణ మాత్రం అవసరం అన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ లేఖ రాయడంలో తప్పులేదన్నారు. ఆయన విమర్శలను నేను సద్విమర్శగానే తీసుకుంటున్నానని అన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. తాను ఎదగాలనుకుంటున్నానని అయితే దొడ్డి దారిన కాకుండా నేరుగా లక్ష్యం చేరుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
తెలంగాణ అనేది అన్నదమ్ముల వంటి సమస్య అన్నారు. సమైక్య రాష్ట్రమా, ప్రత్యేక రాష్ట్రమా అన్న విషయంలో తాను అధిష్టానానికి కట్టుబడి ఉన్నానన్నారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మారలేదన్నారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టవలసి అవసరం లేదన్నారు. తాను కేంద్రమంత్రిని కాబట్టి తెలంగాణ ప్రభుత్వ అంతర్గత విషయమని దానిపై స్పందించనని మాత్రమే చెప్పారన్నారు. దానిపై విపరీతార్థాలు తీయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై నాన్చుడు ధోరణి కూడదని తాను కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణపై నాన్చడానికే ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని అనడంలో అర్థం లేదన్నారు. పిసిసి పదవిని సాంప్రదాయానికి విరుద్దంగా ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ అలాంటి రూల్ ఏమీ లేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన 8వ చాప్టర్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. తెలంగాణ అంశంపై మీడియాను మేనేజ్ చేయడం కూదరని చెప్పారు. కేంద్రానికి తెలంగాణపై మంచి క్లారిటీ ఉందని గతంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలమని చెప్పి కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.