సిఎం కిరణ్ వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో చిరంజీవి భేటీ
Districts
oi-Srinivas G
By Srinivas
|
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గం శాసనసభ్యుడితో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం చిత్తూరులో భేటీ అయ్యారు. ఉదయం హైదరాబాదు నుండి తిరుపతి వెళ్లిన చిరంజీవి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన జిల్లాలోని పలువురు నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా చిరంజీవి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన ఇంటిలో భేటీ అయ్యారు. కాగా సిఎం కిరణ్‌కు, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించాక కూడా ఆయన కిరణ్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. సిఎం పీఠం నుండి కిరణ్‌ను దింపే వరకు తాను ఏం చేయాలో అది చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రిని దింపి వేయడమే తన లక్ష్యమని పెద్దిరెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి పెద్దిరెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా తిరుపతిలోని స్వయంసహాయక సంఘాలకు తిరుమలలో దుకాణాల కేటాయింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రెసులో సాధారణ కార్యకర్తలా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళతానని చెప్పారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెసు మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. చిరంజీవి తిరుపతిలో రెండురోజుల పాటు పర్యటిస్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.