తెలంగాణపై వారంలో నిర్ణయం తీసుకుంటాం: ప్రణబ్ ముఖర్జీ హామీ

ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై తేలుస్తామని గతంలో ఇచ్చిన హామీమేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బుధవారం రాత్రి వీరంతా ప్రణబ్, అహ్మద్ పటేల్‌లతో భేటీ అయ్యారు. గంటన్నర సేపు వీరి సమావేశం జరిగింది. తెలంగాణ నాయకుల వేదనను ఇద్దరూ ఓపిగ్గా విన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఓదార్పు మాటలు పలికారు. తెలంగాణకు అనుకూలంగానా? కాదా? అన్నది మాత్రం చెప్పలేదు. ఆ విషయమే అడిగితే ''మీరంతా తెలంగాణనే కోరుకుంటున్నారు కదా'' అని ఎదురు ప్రశ్న వేసి సానుకూల సంకేతమిచ్చి పంపించేశారు.
ప్రత్యేక రాష్ట్రంపై తాడో పేడో తేల్చుకోవాలన్నట్లు 69 మంది సభ్యుల బృందంగా వచ్చిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రణబ్, అహ్మద్ పటేల్, చిదంబరంలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, డి.కె.అరుణ, ఎం.పి.లు మందా జగన్నాథ్, వివేక్, బలరాం నాయక్, వి.హనుమంతరావులు పాల్గొన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ''ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేం కళేబరాల్లా ఉన్నాం తప్పితే మనుషుల్లా తిరగడంలేదు. మీరు తెలంగాణ ఇస్తారన్న నమ్మకంతో నాలుగు ముఖ్యమైన పదవులు సీమాంధ్రులకు కట్టబెట్టినా నోరు మెదపలేదు. తొందరగా నిర్ణయం తీసుకోకపోతే బయట తిరిగే పరిస్థితి లేదు. మీరు వ్యతిరేక నిర్ణయం ప్రకటిస్తే రాజీనామాలు తప్ప మరో గత్యంతరం లేదు'' అని స్పష్టం చేశారు.