స్థానిక సంక్షోభంపై బొత్స సత్యనారాయణను తప్పు పట్టిన వైయస్ జగన్

సుప్రీంకోర్టు ధర్మాసనం 2010, మే 11న తీర్పు వెలువరించినపుడు పంచాయతీరాజ్ మంత్రిగా బొత్స ఉన్నారని, ఒక అనుభవజ్ఞుడైన బీసీ మంత్రిగా ఈ తీర్పు మన రాష్ట్రానికి ఏ మేరకు వర్తిస్తుందో న్యాయ సలహా తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది బొత్సనే అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి కారణంగా బీసీలకు అన్యాయం జరిగే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలను ఎదుర్కోడానికి భయపడుతున్న సర్కారుతో ప్రతిపక్ష టీడీపీ కూడా కుమ్మక్కైందని, రెండు పార్టీలూ కలిసి సాధ్యమైనంత కాలం ఈ ఎన్నికలు జరక్కుండా సాగదీయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. ఒక వేళ ఎన్నికలు జరపక తప్పనిసరి పరిస్థితులే వస్తే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని 34 శాతం నుంచి 23.45 శాతానికి తగ్గించే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తుత ఎన్నికల్లో అమలు చేస్తే బీసీ కోటా 10.55 శాతం తగ్గుతుందని, అయితే అన్ని రాజకీయ పార్టీలూ ఆ మేరకు జనరల్ స్థానాల్లో బీసీలకు చోటు కల్పిస్తే వారికి 34 శాతం కోటా ఇచ్చినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు
ఏడాది కాలం వృథా చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తోందని, రాజ్యాంగ సవరణ చేయడానికి ఏళ్లు పడుతుందని తెలిసి కూడా ప్రభుత్వం దానికే మొగ్గుచూపుతోందని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏం జరిగిందో గుర్తులేదా? ఇది ప్రజలను మోసగించే చర్య కాదా? ఇది స్థానిక సంస్థలకు రాజ్యాంగ రక్షణ కల్పించిన రాజీవ్‌గాంధీ వారసత్వాన్ని గాలికొదిలేయడం కాదా? అని ఆయన అడిగారు.