హైదరాబాద్: తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని ఆ విషయంపై రాజకీయం చేయవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. బొత్స బుధవారం మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో, ఆంధ్రలో, రాయలసీమలో సెంటిమెంట్ ఉందని, సున్నిత అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. నేను ఏ ప్రాంతం వాడినైనా అన్ని ప్రాంతాల విజ్ఞప్తులను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతా అని అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తానని అన్నారు. మూడు ప్రాంతాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పు లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తారన్నారు. చిరుకు ఆ అర్హత ఉందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయో లేదో అనే అపోహలో ప్రజలు ఉన్నారని అలాంటివి ఏమీ పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని విధానాలు ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాలు తప్పకుండా కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పావలా వడ్డీ, రూ.2 కిలో బియ్యం పథకం కూడా కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తలెత్తుకు తిరిగేలా పని చేస్తానన్నారు. కాగా లింగంపల్లి నుండి పటాన్ చెరుకు బొత్స బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కారణంగా ఆ ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మంత్రులు బొత్స సత్యనారాయణను ప్రశంసల్లో ముంచెత్తారు.
PCC chief Botsa Satyanarayana said today that Telangana issue is sentimental issue. He promised that he will give report to high command on Telangana as it is.
Story first published: Wednesday, June 29, 2011, 15:35 [IST]