పిల్లిగడ్డం ఎందుకు పెంచావు: బాబుకు తులసి రెడ్డి ప్రశ్న
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రజలు గుర్తుపట్టుకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుండు చేయించుకున్నాడన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ నేతలు మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి దేవుడి మొక్కు తీర్చుకుంటే దానిని బాబు కించపర్చడం దారుణం అని ఏడుసూత్రాల చైర్మన్ తులసి రెడ్డి బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి మొక్కు తీర్చుకోవడానికి గుండు చేయించుకున్నాడని మరి చంద్రబాబు తన పిల్లిగడ్డాన్ని ఎందుకు పెంచుకుంటున్నాడో చెప్పాని ప్రశ్నించారు. గుండును కించపర్చడం బాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ముఖ్యమంత్రిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనాగరికం అన్నారు. చంద్రబాబు నానాటికి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు గుండుపై వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై బాబు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలను ఆశించడంలో తప్పు లేదన్నారు. అందరికీ ఓ లక్ష్యం ఉంటుందన్నారు. తనకూ ఏదో కావాలని ఉందని అదృష్టం ఉంటే ఎవరైనా అవుతారన్నారు.