హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాస్త వెనక్కి తగ్గితే మంచిదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మంగళవారం సూచించారు. తెలంగాణ కోసమే తాము రాజీనామా చేశామని మోత్కుపల్లి చెప్పారు. ఇన్నాళ్లు తమపై అవాస్తవ ఆరోపణలు చేసిన కెసిఆర్ ఇప్పుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉన్నందునే ఆయన మౌనంగా ఉంటున్నారని అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టాక ఓటు వేయక పోతే టిడిపిది తప్పవుతుందని అన్నారు.
తెలంగాణ కోసం రాజీనామా చేయని వాళ్లు కూడా ఇప్పటికైనా రాజీనామా చేయాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం కోసమే తాము రాజీనామా చేస్తామని చెప్పామని అలాగే చేశామన్నారు. కాంగ్రెసు వాళ్లు చేయకుండా కేవలం తాము మాత్రమే చేస్తే ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని దాంతో ఫలితం ఉండదన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఓ పార్టీ చెప్పినట్లుగా చేస్తుందని ఆరోపించారు. జెఏసి తమను సంప్రదించకుండానే బందుకు పిలుపునిచ్చిందని జెఏసితో కలిసి పని చేయాలా వద్దా అనే విషయంపై ముందు ముందు నిర్ణయించుకుంటామని చెప్పారు. తాము తెలంగాణ కోసమే రాజీనామా చేశామని రాజకీయ భవిష్యత్తు కోసం కాదన్నారు.