విజయవాడ: తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఉచ్చులో పడిపోయారని మంత్రి రఘువీరారెడ్డి మంగళవారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోన్న శక్తుల చేతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చిక్కుకున్నారని ఇరుక్కు పోయారని అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ రాదని, చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. ఈ పార్టీల వైఖరి కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. తెలంగాణ అంశం ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదని యూపిఏలోని మిగతా రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రాజీనామాలు చేసినవారు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.