హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సిబిఐ ముందు సోమవారంనాడు రెండు కంపెనీల యజమానులు, వారి న్యాయ నిపుణులు హాజరయ్యారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న జయభారత్, పివిపి వెంచర్స్ సంస్థల యజమానులు, న్యాయనిపుణులు సిబిఐ ముందు హాజరై వివరాలు అందించారు. తమ వాదనను వినిపించారు. విదేశీ మారక ద్రవ్యం నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే విషయంపై దర్యాప్తు చేయడానికి సిబిఐ బృందం ఒక్కటి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
జగన్ ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిబిఐ వైయస్ జగన్ సంస్థల్లో పట్టుబడులు పెట్టిన సంస్థలకు, జగన్ సంస్థలకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. మరిన్ని సంస్థలకు సిబిఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.