హైదరాబాద్: తెలంగాణకు, గూర్ఖాలాండుకు సంబంధం లేదని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం అన్నారు. సోమవారం ఎంపీ జగన్నాథం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గుర్ఖాలాండుతో తెలంగాణను పోల్చడం సరికాదన్నారు. గూర్ఖాలాండ్ భారతదేశ సరిహద్దుల్లో ఉన్నందున తెలంగాణతో పోల్చకూడదన్నారు. తెలంగాణ ఉద్యమం యాభై ఆరేళ్లుగా సాగుతుందన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో పస లేదన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ చైనాలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తే ఆయనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఆజాద్ కాకుండా అగ్రనేతలు ఎవరు పిలిచినా వెళతామని చెప్పారు. తమ పోరాటం ముఖ్యమంత్రి పీఠం కోసం కాదన్నారు. తెలంగాణ కోసమే అని చెప్పారు. రాష్ట్ర ప్రకటన ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే రాజీనామాల ఉపసంహరణపై ఆలోచిస్తామని చెప్పారు. తాము ఎవరం ఢిల్లీ వెళ్లవలసిన అవసరం లేదని సోనియానే విమానంలో వచ్చి తెలంగాణ ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఢిల్లీ వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించుకుందని చెప్పారు.