హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ, సీమాంధ్ర నేతలు పట్టువిడుపులు ప్రదర్శించకుండా బిగిసుకుపోతున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం చిక్కుల్లో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సంప్రదింపులయితేనే తాము పాలు పంచుకుంటామని రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులు అంటున్నారు. పైగా, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గులాం నబీ ఆజాద్‌తో తాము చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని అంటున్నారు. తెలంగాణ కోసం ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం కావాలని, అసెంబ్లీ తీర్మానం కావాలని ఆయన చైనాలో చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రజాప్రతినిధులు గుర్రుమంటున్నారు. ఆ ప్రకటనను ఆజాద్ వెనక్కి తీసుకుంటేనే ఢిల్లీకి వస్తామని హైదరాబాదులో పట్టుబట్టి కూర్చున్నారు. ఆజాద్‌పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీలు, ప్రాంతీయ మండళ్లు అవసరం లేదని వారు కచ్చితంగా తేల్చి చెబుతున్నారు.
కాగా, సమైక్యరాగం వినిపించడానికి ఢిల్లీ చేరిన సీమాంధ్ర నేతలు తమ వాణిని పెంచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో సోమవారం కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమైన సీమాంధ్ర నేతలు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే మరిన్ని ముక్కలు చేయాల్సి వస్తుందని వారంటున్నారు. దేశవ్యాప్తంగా ఇది సమస్యను సృష్టిస్తోందని వారంటున్నారు. నిజానికి, పార్టీ ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెసు అధిష్టానం నడుం బిగించింది. అయితే, ఇరు ప్రాంతాల నాయకుల మధ్య చర్చలకు ప్రాతిపదిక కూడా లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం తప్ప మరోటి కూడదని తెలంగాణ నాయకులు, సమైక్యం తప్ప మరోటి కూడదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించడం లేదు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానానికి సమస్య పరిష్కారం కత్తి మీద సాములా తయారైంది.