విజయవాడ: నగర తెలుగుదేశం అధ్యక్షుడు వల్లభనేని వంశీ అనుచరుడు, టిఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు వడ్లమూడి మోహన్‌ది హత్యేనని పోలీసులు సోమవారం తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇద్దరు లిఫ్డు అడిగి ఆయనను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం దానిని ప్రమాదంగా భావించినప్పటికీ ఆ తర్వాత దర్యాఫ్తులో అది హత్యగా తేలింది. ఇందులో హత్యలో ఇద్దరు పాలు పంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులు ఇద్దరు ఒక ముఖ్యమైన నాయకుడి ద్వారా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మోహన్ హత్యకు అక్రమం సంబంధమే కారణమని తెలుస్తోంది. విజయవాడలోని స్థానిక ట్రావెల్స్ యజమాని వదినకు మోహన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత మోహన్, ఆమెకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లుగా తెలుస్తోంది.
వారు పెళ్లికి కూడా సిద్దపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే వదిన, మోహన్ వైఖరి కారణంగా తమ కుటుంబం పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో సదరు ట్రావెల్ యజమాని మోహన్‌ను పలుమార్లు హెచ్చరించారు. మోహన్ ఎంతకూ వినకుండా తరుచూ వచ్చి తన వదినతో ఏకాంతంగా గడపడంతో సదరు ట్రావెల్ యజమాని తన వదినతోనే పెళ్లి విషయంపై మాట్లాడుతామని శుక్రవారం రాత్రి పిలిపించినట్లుగా తెలుస్తోంది. అయితే దారిలోనే ఇద్దరి వ్యక్తులను నియమించి మోహన్‌ను హత్య చేయించేందుకు సదరు ట్రావెల్ యజమాని పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. సదరు ట్రావెల్ యజమాని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి బైక్ పై వెళుతున్న మోహన్‌ను లిఫ్డ్ అడిగి అతనిని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.