వైయస్ జగన్ ఆస్తులపై మరింత దర్యాప్తునకు సిబిఐ

ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించడానికి రెండు వారాల గడువు మాత్రమే ఇవ్వడంతో సీబీఐ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సమయంలో జగన్‌కు సంబంధించిన అన్ని కంపెనీలను విచారించడం సాధ్యం కాదు కాబట్టి జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్‌లలో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై ఆరా తీస్తున్నారు. ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి అందిన ప్రతిఫలాలపై దృష్టిసారిస్తున్నారు. వాటి పెట్టుబడులకు, ప్రభుత్వం నుంచి పొందిన రాయితీలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లాభాలపై స్పష్టత లేకున్నా, రూ.వందల కోట్లు పెట్టుబడులు పెట్టిన సంస్థలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ అభిప్రాయపడుతోంది.
హైకోర్టుకు నివేదిక సమర్పించేందుకు గడువు దగ్గరపడుతుండటంతో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఆదివారం కూడా దర్యాప్తు అధికారులు విధులకు హాజరయ్యారు. రోజూ రాత్రి ఒంటిగంట వరకూ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు పలు కంపెనీల ప్రతినిధులను పిలిచి మాట్లాడిన అధికారులు ప్రస్తుతం దస్త్రాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు 24 కంపెనీలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా, వాటిలో 22 హాజరయ్యాయి. మిగిలినరెండు కంపెనీలు సోమవారం నాటికి తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. మంగళవారం హైకోర్టుకు నివేదికను అందజేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications