న్యూఢిల్లీ: మళ్లీ రాజీనామాలు చేయాలని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెసు నాయకుల స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ విషయాన్ని ప్రకటించారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో తమ శానససభ్యులు మళ్లీ రాజీనామాలు చేస్తారని ఆయన చెప్పారు. ఎప్పుడు తిరిగి రాజీనామాలు చేయాలనే విషయంపై రేపో మాపో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. తమ బాధను, నిరసనను తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వద్ద వ్యక్తం చేస్తామని ఆయన అన్నారు.
రాజీనామాలను తాము ఆజాద్‌కు సమర్పించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆజాద్ వద్దతు తమ ప్రతినిధులు చర్చలకు వెళ్తారని ఆయన అన్నారు. తాము చర్యలకు వ్యతిరేకం కాదని, రాజీనామాలను తిరస్కరించడమే తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ఏకైక లక్ష్యమని, ఆజాద్‌తో చర్చలకు ఎజెండా ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆటుపోట్లకు, వెన్నుపోట్లకు అవకాశం లేదని ఆయన అన్నారు. తామంతా కలిసికట్టుగానే ఉన్నామని ఆయన అన్నారు.