హైదరాబాద్: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఖాతా తెరిచారు. సోషల్ నెట్ వర్కింగ్‌లను యూత్‌తో పాటు అందరూ బాగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పేరున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అధికారులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో సైట్ బుక్‌లో ఖాతా తెరిచారు. ఫేస్ బుక్ ముచ్చటించుకోవడానికి, వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తదితర విషయాలకు ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. యూత్, చదువుకున్న వారు ఫేస్ బుక్‌ను బాగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారికి ప్రభుత్వ పాలన తీరు తెలియపర్చడానికి ఇది ఉపయోగ పడుతుందని భావించి అకౌంట్ తెరిచారు. అంతేకాదు తన ప్రొఫైల్ ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కూడా. ముఖ్యమంత్రి పేరున ఖాతా తెరవడంతో ఇక నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో నడిచే అకౌంట్లు బ్లాక్ అవుతాయి.
ముఖ్యమంత్రి ఫేస్ బుక్‌లో ప్రజలు ప్రశ్నలు అడగవచ్చు. వారు. సమాధానాలు ఇస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారం, ఏమైనా సందేహాలు కూడా ఉంటే తీరుస్తారు. సిఎం ఫేస్ బుక్ ఆకౌంట్లో ప్రభుత్వ సమాచారంతో పాటు ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఉంచుతారు. ఈ ప్రక్రియను ఐటి, సమాచార పౌరసంబంధాల శాఖలు నిర్వహిస్తాయి. సర్కారు నిర్ణయాల అమలు తీరుపై ప్రజలు తమ అభిప్రాయాలు దీని ద్వారా తెలియజేయవచ్చు. వీటిని ముఖ్యమంత్రి సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు పంపిస్తారు. దీనిపై సదరు శాఖ సమాధానం చెప్పవలసి ఉంటుంది.