పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లో LPG సిలిండర్ ధరలు తెలిస్తే షాక్ అవుతారు..?
భారత్ లో ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను శనివారం అర్ధరాత్రి నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సిలిండర్ పై రూ. 29 మేర ధర పెంపుదల నమోదైంది. గత మూడు నెలల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ధరల సవరణ అనివార్యమని ప్రభుత్వం వెల్లడించింది. పొరుగు దేశాలతో పోల్చినప్పుడు.. భారత్ లో ఎల్పీజీ ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌లో సిలిండర్ ధర రూ. 1,046 ఉండగా, నేపాల్ లో అయితే రూ. 1,207, బంగ్లాదేశ్ లో రూ. 1,225, శ్రీలంకలో రూ. 1,241గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికాలో రూ. 1,755, ఆస్ట్రేలియాలో రూ. 1,765, కెనడాలో ఏకంగా రూ. 2,411 చొప్పున ధరలు నమోదవుతున్నాయి. తాజా పెంపుతో రాజధాని దిల్లీలో 14.2 కేజీల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కి చేరింది. అయితే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే వెసులుబాటు కొనసాగుతుంది.
వీరికి ప్రతి రీఫిల్ పైన రూ. 300 సబ్సిడీ వర్తిస్తుంది, దీనివల్ల వారికి సిలిండర్ ధర రూ. 642కే లభిస్తుంది. కాగా, ఈ సబ్సిడీ ప్రయోజనం ఏడాదికి మొదటి నాలుగు రీఫిల్స్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ ఏడాది మార్చి 7న సిలిండర్ ధరను రూ. 60 మేర పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెంచిన రూ. 29 కలిపి, గత మూడు నెలల్లో మొత్తం రూ. 89 భారం పడింది. తాజా సవరణకు ముందు, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి సిలిండర్ విక్రయంపై సుమారు రూ. 703 వరకు నష్టపోతున్నాయని అంచనా వేశారు.
పశ్చిమాసియాలో ఫిబ్రవరి చివరలో యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ ప్రభావంతో గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన సౌదీ కాంట్రాక్ట్ ధర (CP) దాదాపు 46 శాతం పెరిగింది. దీనివల్ల దేశీయ ఎల్పీజీ సరఫరా వ్యయం సిలిండర్‌కు రూ. 1,600 దాటిందని.. దీనిని భరించలేక ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి, దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై చమురు సంస్థలకు జరిగిన మొత్తం నష్టాలు దాదాపు రూ. 60,000 కోట్లకు చేరుకున్నాయి.

ఇది అంతకుముందు ఏడాది రూ. 41,338 కోట్లుగా ఉంది. ఈ నష్టాలను కొంతవరకు భర్తీ చేసేందుకు కేంద్ర కేబినెట్ రూ. 30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ ఇంధన ధరల అస్థిరత నుంచి సామాన్య గృహస్థులను రక్షిస్తూనే, దేశవ్యాప్త సరఫరా గొలుసును కొనసాగించడం ఈ నిర్ణయ ఉద్దేశమని అధికార వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications