ఓ చెంచాడు 'అతి మధురం చూర్ణం' తో ఆరోగ్య సమస్యలు పటాపంచలు
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, గొంతు నొప్పి వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఆరోగ్య రుగ్మతలకు ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది.. అతి మధురం చూర్ణం. దీన్ని యష్టిమధు చూర్ణం, ములేతి అని కూడా పిలుస్తారు. ఈ హెర్బల్ పొడి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.
అతి మధురం చూర్ణం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చరక సంహిత, సుశ్రుత సంహితల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. దీని విశిష్టతను ఏమిటనేది వీటిల్లో వివరంగా పొందుపరిచారు. శరీరంలోని పిత్త దోషాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని మధుర రసం, శీతల గుణం వల్ల శరీరంలో తలెత్తే మంట, కడుపు ఉబ్బరం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి అతి మధురం చూర్ణం ఓ సంజీవనిలా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో మంట, హైపర్ ఎసిడిటీ ఉన్నప్పుడు ఈ చూర్ణాన్ని నిర్దేశిత మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇది జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తిని క్రమబద్ధం చేసి, గ్యాస్ట్రిక్ పొరను సంరక్షిస్తుంది. మౌత్ అల్సర్, పేగుల వాపు వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
మారుతున్న కాలంతో పాటు వచ్చే జలుబు, పొడి దగ్గు, గొంతు నొప్పి నుండి అతి మధురం చూర్ణం త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి శ్వాసకోశ మార్గాన్ని సులభతరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అతిమధురం చూర్ణం చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మంపై వచ్చే నల్లటి మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్‌ను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. రోజువారీ ఒత్తిడి, మానసిక అలసట, ఆందోళనలను దూరం చేసి మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ చూర్ణం ఎంతగానో సహాయపడుతుంది.
అతి మధురం చూర్ణాన్ని సరైన పద్ధతిలో వాడితేనే ఆశించిన ఫలితాలు అందుతాయి. సాధారణంగా పెద్దలు రోజుకు ఒకటి నుండి మూడు గ్రాముల పొడి, పిల్లలకు 250 నుండి 500 మిల్లీగ్రాముల మోతాదులో డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవచ్చు. గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు నెయ్యితో కలిపి, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో సేవించాలి.
అతి మధురం చూర్ణం పూర్తిగా మూలికా ఆధారితమైనది. అయినప్పటికీ.. దీనిని పరిమితికి మించి వాడటం మంచిది కాదు. ముఖ్యంగా ఏకధాటిగా ఆరు నుండి ఎనిమిది వారాల కంటే ఎక్కువ కాలం డాక్టర్ల సలహా లేకుండా దీనిని ఉపయోగించకూడదు.
మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయి తగ్గి బీపీ పెరగడం లేదా శరీరంలో నీరు చేరి కాళ్ల ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హైబీపీ, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు అ అతి మధురం చూర్ణాన్ని తీసుకునే ముందు ఆయుర్వేద డాక్టర్లను సంప్రదించాలి. తీపి రుచి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications