"పరువుతీయకండి రాహుల్" - కాంగ్రెస్ స్కిట్ లో "మెలోనీ" ప్రస్తావనపై కేంద్రం ఫైర్ ..!
నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ రచనాత్మక్ పేరుతో ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ విదేశాంగ విధానాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ నేత సందీప్ దీక్షిత్ ను దూరం నుంచి ప్రధాని మోడీ తరహాలో చేతులు చాపుతూ వచ్చి రాహుల్ గాంధీ కౌగిలించుకున్నారు. మన విదేశాంగ విధానం ఇలా ఉందని ఆయన ఆరోపించారు. దీంతో సందీప్ దీక్షిత్ తనను మెలోనీ అనుకోలేదు కదా అని సరదాగా అనగా.. రాహుల్ తాను ఇంకా ఆ స్థాయికి వెళ్లలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (centre) స్పందించింది. విదేశీ నాయకులను ఉద్దేశించి చేసే రాజకీయ వ్యాఖ్యలలో సంయమనం, గౌరవం పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ పిలుపునిచ్చింది. ఇటలీతో భారతదేశానికి బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఆ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఏ విషయాన్నైనా గౌరవప్రదంగా ప్రస్తావించాలని ఆయన సూచించారు.

రాహుల్ గాంధీ నిన్న చేసిన ప్రసంగంలో విదేశాంగ విధానం ద్వారా భారతదేశ ప్రయోజనాలను కాపాడటంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ప్రపంచ నాయకుల పట్ల ప్రధాని వైఖరిని సైతం ప్రశ్నించారు. తన నాయనమ్మ, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమెరికాతో జరిపిన సంభాషణలను గుర్తుచేస్తూ.. భారత విదేశాంగ విధానం విదేశీ నాయకులతో వ్యక్తిగత సంబంధాల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భారత్ కు మిత్రులైన అమెరికా-ఇరాన్ తమ యుద్దానికి మధ్యవర్తిత్వం కోసం భారత్ ను కాదని, పాకిస్తాన్ ను మధ్యవర్తిగా ఎంచుకోవడాన్ని ప్రస్తావించారు. తద్వారా భారత్ కంటే వారిద్దరికీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి సరైన దేశంగా కనిపించినట్లుందన్నారు.














Click it and Unblock the Notifications