రెచ్చగొట్టొద్దు.. గట్టి దెబ్బ కొడతాం:పాకిస్థాన్ పై అజిత్ దోవల్ ఫైర్
పాకిస్థాన్ పై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(NSA) అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సహనాన్ని బలహీనతగా భావించరాదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా భారత్ ఎప్పుడూ రిస్క్ లు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుందని.. బలంగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై తొలిసారిగా స్పందించిన అజిత్ దోవల్ ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ను ఎలా చేపట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నామని పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలక ఉగ్ర స్థావరాలపై, ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేపట్టామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ధీటుగా స్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సింధూర్ తో చూపామని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.
ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ డాక్యుమెంటరీలో ఆనాటి తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ కీలకమైన డాక్యుమెంటరీ ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ అలాగే డిస్కవరీ ప్లస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. ఇందులో దాదాపు 88 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్ వెనక ఉన్న వ్యూహాలు, నిర్ణయ ప్రక్రియపై దోవల్ వివరించనున్నట్లు సమాచారం.
ఇక జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.

వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్ అలాగే సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications