రాజీనామాలకు సిద్ధపడిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు

సుమారు 25 నుండి 29 వరకు శాసనసభ్యులు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. వారితో పాటు ఇద్దరు పార్లమెంటు సభ్యులు సైతం రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలు 35 మందికి మించితే ప్రభుత్వానికి మద్దతు సైతం ఉపసంహరించుకోవాలనే యోచనలో జగన్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీనామాల సంఖ్య 30 దాటుతుందా లేదా అనే విషయంపై సైతం వారు సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ విషయంపై ఓ టీవీ ఛానల్‌తో శోభా నాగిరెడ్డి మాట్లాడారు. దివంగత వైయస్ వల్లే గెలిచామని చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, అలాంటి వైయస్‌పై కుట్ర కేసు పెట్టడం వల్ల చాలామంది ఎమ్మెల్యేలు తీవ్ర మనస్థాపం చెందారని అన్నారు. టిడిపి, కాంగ్రెసు పార్టీలు కలిసి జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్ర పన్నుతున్నాయన్నారు. టిడిపి తన మీడియాను అడ్డుపెట్టుకొని జగన్‌ను దెబ్బతీయాలని చూస్తుందన్నారు. వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని దానిని మరింత ప్రజల్లోకి తీసుకెళతామని ఆమె అన్నారు.
జగన్‌పై చేస్తున్న కుట్రల కారణంగా తక్షణ నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి ఉన్నవని మరో నేత అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఆది, సోమ వారాలు జగన్ వర్గం నేతలం భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సిబిఐ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఎదుర్కోవాలో చర్చిస్తామని అన్నారు. రాజీనామలపై కొంతమంది సానుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. రాజీనామాలపై చర్చలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications