కెసిఆర్‌తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, కేంద్రం దూతగా?

కెసిఆర్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే అసదుద్దీన్ వెళ్లిపోయారు. గత 15 రోజులుగా సకల జనుల సమ్మె జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ స్థితిలో అసదుద్దీన్ కెసిఆర్‌ను కలుసుకున్నారు. రాష్ట్రాన్ని విభజించడం బర్త్ డే కేక్ కట్ చేసినంత సులభం కాదని అసదుద్దీన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ భేటీపై తెరాస వర్గాలు కూడా నోరు మెదపడం లేదు. ముఖ్యమైన సమాచారం ఉండడం వల్లనే ఎవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. కాంగ్రెసులో తెరాస విలీనం గురించి అసదుద్దీన్ కెసిఆర్‌తో ఏమైనా మాట్లాడారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులపై విశ్వాలం లేకపోవడంతో మూడో వ్యక్తిగా కాంగ్రెసు అధిష్టానం అసదుద్దీన్‌ను కెసిఆర్ వద్దకు పంపినట్లు భావిస్తున్నారు. ముస్లింల సంక్షేమంపై ఏర్పడిన సచార్ కమిటీ నివేదిక అమలుకు సహకరించాలని తాను కెసిఆర్‌ను కలిసినట్లు ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంపై తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ఆయన చెప్పారు. అయితే, ఆయన సచార్ కమిటీ నివేదికపైన కాకుండా తెలంగాణపైనే కెసిఆర్‌తో చర్చలు జరిపారని బలమైన ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications