కాంగ్రెసుకు కెసిఆర్ బంపర్ ఆఫర్ ప్రకటిస్తారా?

ఓ వైపు సకల జనుల సమ్మె, మరోవైపు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన కెసిఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం వెనుక మతలబు ఉండొచ్చనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కేంద్రం తెలంగాణ ఇస్తే చిరంజీవి దారిలోనే తాను నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి చెప్పేందుకే వెళ్లారనేది పలువురి అభిప్రాయం. గతంలోనూ ఓమారు తెలంగాణ ప్రకటిస్తే తెరాసను కలుపుతారా అనే వాదనలు ఉన్నాయని కెసిఆరే స్వయంగా చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు మధుయాష్కీ తదితరులు కూడా తెరాస కాంగ్రెసులో కలిస్తే తెలంగాణ వస్తుందని తరుచూ అంటున్నారు.
ప్రస్తుతం ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గట్టి సత్తా చాటగల కెసిఆర్ హఠాత్తుగా తెలంగాణ కోసం తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధపడే ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ కోసం పార్టీని త్యాగం చేసే ఉద్దేశ్యం ఆయనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉద్యమం ఉధృతంగా ఉన్న ఈ సమయంలో ఢిల్లీ పర్యటన వెనుక కాంగ్రెసును ఇరుకున పెట్టే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చనేది మరికొందరి అభిప్రాయం. కాంగ్రెసుతో జతకట్టి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కెసిఆర్ వెళ్లాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది తెలంగాణ కోసం కాదని కాంగ్రెసుతో లాలూచీ పడటానికని టిడిపి ఆరోపిస్తోంది. మరి కెసిఆర్ తెలంగాణ కోసం పార్టీని త్యాగం చేయడం కోసం వెళ్లారా లేక టిడిపి ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెసుతో లాలూచి పడటానికి వెళ్లాడా?












Click it and Unblock the Notifications