ఒక్క వివాహం చేసుకున్నవాళ్లే ఈ రాష్ట్రంలో ఉంటారు: సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒక్క వివాహం చేసుకున్నవాళ్లు మాత్రమే రాష్ట్రంలో ఉంటారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో నివసించాలి అనుకునేవారు కేవలం ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుని ఉండాలని అన్నారు. ఈ మేరకు త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే ఈ కోడ్ ఉద్దేశమని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో రాబోయే వర్షాకాల సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక్క పెళ్లి చేసుకున్నవారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. కట్ని జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి అయినప్పుడు హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలి..? అందరికీ ఒకే చట్టం ఉండాల్సిందే. రామ్ కు ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు.. రహీమ్ కు రెండు, మూడు, నాలుగు వివాహాలు ఎందుకు..? ముస్లిం సోదరీమణులు కూడా మనకు సోదరీమణులే. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం.. ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్ లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది అని సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

ఇక మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ను చట్టబద్ధం చేసి, విజయవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ కాగా.. 2025 జనవరి 27 నుంచి ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి అంశాలపై ఇక్కడి ప్రజలందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది.












Click it and Unblock the Notifications