కోనేరు ప్రసాద్‌తో వైయస్, చంద్రబాబు లింక్‌లపై ఆరా

అక్రమాలకు పాల్పడినట్లు కోనేరు ప్రసాద్‌పై తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోనేరు ప్రసాద్ తన కార్యకలాపాలను ఉధృతం చేశారని అంటారు. హైటెక్ సిటీ సమీపంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రసాద్ చంద్రబాబు హయాంలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. టౌన్‌షిప్ కమ్ గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టు కోసం కోనేరు ప్రసాద్ చంద్రబాబు హయాంలో గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 2002లో 535 ఎకరాల భూమిని కేటాయించేలా పనిచేశాడని చెబుతారు.
కాంగ్రెసు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితోనూ సన్నిహిత సంబంధాలు నెరిపాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏడు ఎమిరేట్స్‌లో ఒక్కటైన రాస్ ఆల్ ఖైమా (రాక్) బిజినెస్ అంబాసిడర్ అయిన తర్వాత కోనేరు ప్రసాద్ మరింత విజృంభించినట్లు చెబుతారు. రాక్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్టు మార్కెటింగ్ ఏజెంటుగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో రెండు బిలియన్ల అల్యుమినా రిఫైనరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దానికి ప్రభుత్వం 250 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ శివారులోని సుల్తాన్‌పూర్‌లోని 576 ఎకరాల్లో ఎకనమిక్ సిటీని నిర్మించే ప్రాజెక్టు రాక్‌కు దక్కడంలో ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. దీనికోసం ప్రసాద్, ఆయన కుమారులు హైదరాబాద్ ఎకనిమిక్ సిటీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు.












Click it and Unblock the Notifications