సుప్రీంకు వెళ్లడంపై చంద్రబాబు ముందరి కాళ్లకు బంధం

నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని, సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఇప్పటికే పెద్ద యెత్తున అంటున్నారు. చంద్రబాబుపై రాజకీయ విమర్శల దాడిని పెంచారు, సామాజిక కార్యకర్త అన్నా హజారే స్థాయిలో మాట్లాడుతున్న చంద్రబాబు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదని కూడా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. చంద్రబాబు తనకు తాను నిజాయితీపరుడని, చిత్తశుద్ధి గలవాడిని అని చెప్పుకునే బదులు బయటవాళ్లు చెప్తే విలువ పెరుగుతుందని, అందువల్ల చంద్రబాబు విచారణకు అంగీకరించాలని కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు.
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి చంద్రబాబు ముందరి కాళ్లకు బంధం పడినట్లయింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాదు నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ నాయకులతోనూ న్యాయ నిపుణులతోనూ మాట్లాడే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాలపై తెలుగుదేశం నాయకులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. చంద్రబాబుపై పిటిషన్ వేయడం వెనక రాజకీయ కుట్ర ఉందని తప్ప మరేమీ మాట్లాడలేని స్థితిలో వారున్నారు. వారేం చెప్పినా జగన్‌పై విచారణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడినట్లే ఉంటుంది. దాంతో జగన్‌కు, చంద్రబాబుకు తేడా లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలుగుదేశం నాయకులు భయపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications