బొత్స భేటీ, విప్ జారీకి మొండికేస్తున్న చిరంజీవి

బొత్సతో కలిసి తన పార్టీ శాసనసభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని చిరంజీవి అనుకున్నారు. దీంతో శాసనసభ్యులు యలమంచిలి రవి, అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. అయితే, మరింత గందరగోళం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆ సమావేశాన్ని ఆయన విరమించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఆవేదన న్యాయమైందేనని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను చిన్నచూపు చూడబోమని, ఇచ్చిన హామీలను పార్టీ అధిష్టానం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. అయినా విప్ జారీ చేయడానికి చిరంజీవి సముఖత వ్యక్తం చేయలేదు.
మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, నియోజకవర్గాల అభివృద్ధి పనులపై హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ కావాలని, అప్పుడే విప్ జారీ చేస్తానని చిరంజీవి చెప్పినట్లు సమాచారం. తాను అధిష్టానానికి, ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియజేస్తానని బొత్స చెప్పారు. ఈ స్థితిలో ఆజాద్ చిరంజీవికి ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వానికి సహకరించాలని, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు తగిన ప్రాధాన్యం ఇస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన చిరంజీవితో చెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో చిరంజీవి తన వర్గం శాసనసభ్యులతో రేపు ఆదివారం సమావేశం కానున్నట్లు సమాచారం. చిరంజీవి విప్ జారీ చేయకపోతే శాసనసభ్యులు ఎటు వైపు ఓటేసినా చెల్లుబాటవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications