అమరావతి రోప్ వే ప్రాజెక్టుకు ఆమోదం.. దుర్గమ్మదర్శనం, కృష్ణమ్మ అందాలే కాదు.. అవికూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పైన ఏ విధంగా అయితే ఫోకస్ పెడుతుందో అదేవిధంగా ఏపీలో రాజధాని ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేలా, పర్యాటకులను ఆకర్షించేలా పలు ప్రాజెక్టులపైన అంతే ఫోకస్ పెడుతుంది. విజయవాడ నుంచి అమరావతి కృష్ణానది పైన రోప్ వే నిర్మాణ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం తెలిపింది.
విజయవాడ, అమరావతి మధ్యలో కృష్ణానదిపై రోప్ వే ప్రాజెక్ట్ కు ఆమోదం
ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ పర్యాటక ప్రాంతాల నుండి అమరావతికి, కృష్ణానది మీదుగా కేబుల్ కార్లలో ప్రయాణంచేసే వెసులుబాటు కలుగుతుంది. విజయవాడ, రాజధాని అమరావతి నగరాల మధ్యలో కృష్ణానదిపైన రోప్ వే ద్వారా ఏర్పాటు చేస్తున్న కేబుల్ కార్ ప్రాజెక్ట్ కు అధికారికంగా ఆమోదం లభించడంతో ఈ ప్రాజెక్టులో వేగంగా అడుగులు పడుతున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని విధాలా సన్నద్ధం
పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయా ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే అవసరమైన భూసేకరణ, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్ లేదా ప్రత్యేక నిధులు కేటాయింపు పైన అధికారులు కసరత్తు పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులు, నదిపై నిర్మించే పిల్లర్లు, టవర్ల భద్రతా ప్రమాణాలపై ప్రాథమిక సర్వేలు పూర్తి చేశారు. ఏపీ సిఆర్డిఏ బోర్డు సమావేశంలో ఈ మేరకు తుది ప్రణాళికను ఆమోదించారు.

కృష్ణా నది తీర ప్రాంతం అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భవానీ ద్వీపానికి వచ్చే పర్యాటకులు, బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చే భక్తులు కృష్ణా నది అందాలను తిలకిస్తూ ప్రయాణం చేయవచ్చు. వారు ఏపీ రాజధాని అమరావతిని కూడా చూడవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, కృష్ణా నది తీర ప్రాంతం అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఏర్పడుతుంది.
అమరావతి ఐకానిక్ ప్రాజెక్ట్ లలో ఇది ఒకటి
దీనికి ఏపీ సిఆర్డిఏ నుండి ఆమోదం లభించడంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ఐకానిక్ ప్రాజెక్ట్ లలో ఈ కృష్ణా నది రోప్ వే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రోప్ వే ప్రతిపాదిత మార్గం ఇదే
ఈ రోప్ వే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఇంద్రకీలాద్రి, పున్నమి ఘాట్, భవానీ ద్వీపం మీదుగా అమరావతిలోని టిటిడి ఆలయం వరకు సాగనుంది. ఈరోజు టెర్మినల్ పాయింట్ల వద్ద అత్యాధునిక పార్కింగ్ స్థలాలు, ఫుడ్ కోర్టులు, వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా ఈ రోప్ వే ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో పర్యాటక శోభ మరింత పెరగనుంది.












Click it and Unblock the Notifications