దమ్ముంటే సచివాలయాలు రద్దు..! వైసీపీ సంచలన డిమాండ్..!
జగన్ మీద కోపంతో సచివాలయ ఉద్యోగులను వర్గ శత్రువులుగా చూస్తున్నారని వైఎస్సార్సీపీ (YSRCP)నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను చేరువ చేసిన గ్రామ సచివాలయాలను బలహీనపరుస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాబ్ చార్టులు, సర్వీస్ రూల్స్, పదోన్నతులు అన్నీ జగన్ హయాంలోనే కల్పించామని ప్రభుత్వానికి గుర్తుచేశారు. కావాలంటే 17 కేటగిరీల ఉద్యోగాలకు సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన జీవోలు చూసుకోవాలన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే సచివాలయాలు రద్దు చేయాలని ఆయన సవాల్ విసిరారు.
కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టి, 140 మందికి పైగా సస్పెండ్ చేసిందని కురసాల కన్నబాబు ఆరోపించారు. చివరకు మహిళా ఉద్యోగులను కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధించడం దారుణమన్నారు. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకి మొదటి నుంచీ చులకన భావనే ఉందని, వైసీపీ మాదిరిగానే సచివాలయ ఉద్యోగులను కూడా వర్గ శత్రువులుగా చూస్తూ అణచివేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు సంబంధించిన జాబ్ చార్ట్‌లు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానెల్స్‌ను నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పష్టంగా రూపొందించామని కన్నబాబు స్పష్టం చేశారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వం కానీ, వారిని భయపెట్టడం కాదన్నారు. గ్రామ సచివాలయాలు అనాలోచిత వ్యవస్థ అని కూటమి ప్రభుత్వం భావిస్తే, దానిని రద్దు చేసే ధైర్యం ఉందా అని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. రద్దు చేసే ధైర్యం లేకపోతే, జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను ఎందుకు క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పేర్లు మార్చడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం పాలన కాదని ప్రభుత్వం గుర్తించాలన్నారు. సచివాలయ వ్యవస్థపై రాజకీయ కక్ష ఉంటే అది ప్రభుత్వ నిర్ణయం కావచ్చు కానీ, దాని భారం ప్రజలపై పడకూడదన్నారు. జాబ్ చార్టులు, సర్వీస్ రూల్స్, పదోన్నతులు, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, పే రివిజన్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని ఆయన కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలని, గ్రామ సచివాలయ ఉద్యోగుల హక్కుల కోసం, ప్రజలకు చేరువైన పాలన కోసం వైఎస్సార్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని కన్నబాబు హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
