ఏడాదికి రెండే ఇంజెక్షన్లు.. గుండెపోటుకు చెక్ పెట్టే కొత్త మందు!
చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి.. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏడాదికి కేవలం రెండుసార్లు ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోయే ఛాన్స్ సమీపిస్తోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన కీలక క్లినికల్ ట్రయల్ ఫలితాల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నొవార్టిస్ సంస్థ రూపొందించిన ఈ ఔషధం పేరు 'ఇంక్లిసిరాన్'. ఇది లెక్వియో బ్రాండ్ పేరులో లభిస్తుంది. సాధారణంగా వాడే స్టాటిన్స్ వంటి కొలెస్ట్రాల్ మందులతో పోలిస్తే ఇది భిన్నమైన విధానంలో పనిచేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ ఎందుకు ప్రమాదకరం?
రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలలో కొలెస్ట్రాల్ ఒకటి. శరీర పనితీరుకు కొంత కొలెస్ట్రాల్ అవసరమైనప్పటికీ.. చెడు కొలెస్ట్రాల్(ఎల్డీఎల్) స్థాయిలు అధికంగా ఉంటే ప్రమాదకరం. కాలక్రమేణ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలలో పేరుకుపోయి కొవ్వు నిక్షేపాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల ధమనులు ఇరుకుగా మారి రక్తప్రసరణ తగ్గుతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలలో ఈ అవరోధం ఏర్పడితే గుండెపోటుకు, మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోతే స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచడం అత్యంత కీలకం.

ఇంక్లిసిరాన్ ఎలా పనిచేస్తుంది? మోతాదు వివరాలివే..!
మన కాలేయం 'పీసీఎస్కే9' అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రొటీన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కాలేయం తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇంక్లిసిరాన్ ఈ ప్రొటీన్ ఉత్పత్తిని కాలేయంలో అడ్డుకుంటుంది. ఫలితంగా రక్తప్రవాహం నుంచి కాలేయం మరింత ఎక్కువ చెడు కొలెస్ట్రాల్‌ను గ్రహించి.. ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. రోజూ వేసునే మాత్రల మాదిరిగా కాకుండా కాలేయంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం ఇది 'స్మాల్ ఇంటర్‌ఫెరింగ్ ఆర్ఎన్ఏ' టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
రోజూ మందులు వేసుకోవాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. వైద్య నిపుణుల ద్వారా చర్మం కింద ఈ ఇంజెక్షన్ ఇస్తారు. మొదటి మోతాదు మొదటి రోజున, రెండో మోతాదు మూడు నెలల తర్వాత ఇస్తారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రామాణిక కొలెస్ట్రాల్ చికిత్సతో పాటు దీన్ని వాడినప్పుడు చెడు కొలెస్ట్రాల్ దాదాపు 40 నుంచి 53 శాతం వరకు తగ్గుతుందని క్లినికల్ అధ్యయనాలు చూపాయి.
ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు
ఫేజ్-3 'ఓరియన్-4' ట్రయల్ లో ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్న 16 వేల మందికి పైగా పాల్గొన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న కొలెస్ట్రాల్ మందులకు అదనంగా ఇంక్లిసిరాన్‌ను చేర్చడం వల్ల తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయా అనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది. నవంబర్ 23, 2026న తమ ట్రయల్ ప్రాథమిక లక్ష్యాన్ని సాధించిందని నొవార్టిస్ సంస్థ ప్రకటించింది. గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రధాన గుండె సంబంధిత ఘటనలలో గణాంకపరంగా గణనీయమైన తగ్గుదల కనిపించిందని ఫలితాలు వెల్లడించాయి. కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా గుండె జబ్బులు ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలను నివారించడంలోనూ ఇది తోడ్పడుతుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ట్రయల్ పూర్తి వివరాలు 2027 ప్రథమార్థంలో వెలువడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
