తెలంగాణ రాష్ట్రం వస్తే నాయకులే నష్టపోతారు: కిషన్‌రెడ్డి

విడిపోతే సామాన్యులు లాభపడతారని కేవలం నాయకులే నష్టపోతారని అందరూ సంతోషంగా ఉంటారని దీనిని అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. లోకసభలో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీలో తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ నుండి ఎవరూ వెళ్లి పోవాల్సిన అవసరం లేదన్నారు. సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను నాన్చి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చవద్దని సూచించారు. హైదరాబాదులో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు.
మూడేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే అన్నారు. ఈ ప్రభుత్వంలో సమష్టి బాధ్యత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సంవత్సరమే అయినందున వైఫల్యంలో ఆయన ఒక్కరి బాధ్యతే ఉందని చెప్పలేమని అయితే ఎనిమిదేళ్లు పాలించిన పార్టీగా ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. మంత్రులే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. రాజీవ్ కిరణాలు కిరణ్ ప్రచార కిరణాలు అని ఎద్దేవా చేశారు. ముందుంది మంచి కాలం అంటున్నారని మరి ఆ మంచికాలం ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం పోతే మంచి కాలం వస్తుందేమోనని అవిశ్వాసానికి తాము మద్దతిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం విస్మరించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఎంపీలే ధర్నాలు చేసి అదేమంటే అధిష్టానం చూసుకుంటుందన్నారు. బెంగళూరులో మెట్రో రైలు పట్టాలకెక్కితే ఇక్కడ శంకుస్థాపన దశలోనే ఉందన్నారు. కరవుపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పేదల గుండె ఇప్పుడు దడ దడ అని కొట్టుకోవడం లేదని ధరలు ధరలు అని కొట్టుకుంటుందన్నారు. కాంగ్రెసు హయాంలో అన్ని ధరలు పెరిగాయన్నారు.












Click it and Unblock the Notifications