డీలిమిటేషన్ బిల్లు కోసం కేంద్రం బిగ్ స్టెప్.. ఇక తప్పట్లేదు!!
దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 13వ తేదీతో ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఈ బిల్లులేవీ కూడా చర్చకు రాలేదు.
దీంతో పార్లమెంట్ ఉభయసభలను శానిడై చేయకుండా నిలిపి ఉంచాలని కేంద్రం భావిస్తోంది. అత్యవసరంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదింపజేసేందుకు వీలుగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఈ బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంట్ ను సమావేశపర్చనుంది.

ఈ సవరణ బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపజేయడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకుంటోంది. తగినంత సంఖ్యాబలంపై పూర్తి భరోసా లభించిన వెంటనే సమావేశాలు ఆరంభమౌతాయి. 16న డీలిమిటేషన్, 17న మహిళా రిజర్వేషన్ బిల్లులు సభలో ప్రవేశపెడతారు. 18న చర్చ అనంతరం సమావేశాలు ముగుస్తాయి.
దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రతిపాదిత బిల్లుల ముఖ్య ఉద్దేశం.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియను నూతనంగా ప్రారంభించడం. ఈ ప్రక్రియ పూర్తయితే లోక్‌సభ స్థానాల సంఖ్య ఏకంగా 800 దాటే అవకాశం ఉంది. గత పార్లమెంట్ సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ కమిషన్.. తాజాగా అందుబాటులో ఉన్న జనాభా గణాంకాల ఆధారంగా అన్ని నియోజకవర్గాల సరిహద్దులు, స్థానాల సంఖ్యను పునర్నిర్మిస్తుంది.
ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ సభ్యుల గరిష్ట సంఖ్య 850 వరకు పెంచే వీలుంటుంది. వీటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే స్థానాలను 35 వరకు నిర్ధారించవచ్చు. ఫలితంగా జాతీయ స్థాయిలో మొత్తం సీట్లు దాదాపు 850 వరకు చేరే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిథ్యం లభించడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించడానికి అవసరమైన స్పష్టత లభిస్తుంది.
సాధారణంగా జనాభా ప్రాతిపదికన, ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి లోక్ సభ నియోజకవర్గాల హద్దులను నిర్ణయిస్తారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న లోక్‌సభ స్థానాలు కేవలం 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించినవి. ఆ తర్వాత జనాభా పెరిగినప్పటికీ నియోజకవర్గాల రాజకీయ స్థిరత్వం కోసం లోక్‌సభ స్థానాల పెంపును మొదట 2001, ఆ తర్వాత ఈ ఏడాది వరకు నిలిపివేశారు. చివరిసారిగా 1973లో జనాభా లెక్కల ఆధారంగా దేశంలో లోక్‌సభ స్థానాలను 543గా ఖరారు చేశారు.













Click it and Unblock the Notifications