హైదరాబాద్‌లో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి దారుణ హత్య

హైదరాబాద్: విప్లవ దేశభక్త పులులు సంస్థ వ్యవస్థాపకుడు, పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో గల బొగ్గులకుంట ప్రాంతంలో అతన్ని దారుణంగా హత్య చేశారు. ఐదుగురు హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తొలుత హత్యకు గురైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని గుర్తించలేదు. కాలికి, చేతికి ఉన్న పోలియో ఆనవాళ్లను బట్టి మృతుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డేనని గుర్తించారు.
ఆటోలో ప్రయాణిస్తున్న గోవర్ధన్ రెడ్డి డాగర్స్, కత్తులతో దాడి చేసి చంపారు. బొగ్గులకుంట ప్రాంతంలో ఆటోను వెంటాడి, అటకాయించి గొంతు కోసి హత్య చేశారు. మంగళవారం సాయంత్రం ఈ హత్య జరిగింది. గోవర్ధన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి కూడా ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు ఆటోను వెంబడించారని, మరో ఇద్దరు కాపు కాశారని, ఐదుగురు దాడి చేసి చంపారి పోలీసులు వివరించారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఇటీవలే చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి సంచలన ప్రకటనలు చేశాడు.
హిమాయత్ నగర్‌లోని తెలుగు అకాడమీ ప్రాంతం నుంచి గోవర్దన్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి కోఠీ ప్రాంతానికి వచ్చాడు. తమను వెంబడిస్తున్నారని గ్రహించి, ఓ సందులోకి ఆటోను మళ్లించారు. అక్కడే అతనిపై దాడి జరిగింది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. ఆటో డ్రైవర్‌ను బంధించి గోవర్ధన్ రెడ్డిని హత్య చేశారు. తనకు ప్రాణహానీ ఉందని ఇటీవల పటోళ్ల గోవర్ధన్ రెడ్డి చెప్పాడు. మృతుడితో పాటు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డికి పలువురు శత్రువులున్నారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి చుట్టూ అనుచరులు ఉండేవారని, ఈ రోజు వారంతా లేకుండా ఓ ఆటోలో అతను ఎందుకు వెళ్లాడని అంటున్నారు. ఆటోలో పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో పాటు ఉన్నదెవరనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications