హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ బహిరంగ లేఖ పూర్తి పాఠం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణపై తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, తమది దండయాత్ర కాదని, రాజకీయ రంగు పులిమి తన దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బయలుదేరే ముందు మీడియాకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దాని పూర్తి పాఠం ....

‘‘రైతు బాగులోనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే పార్టీ మాది. రాష్ట్రంలో రైతు పరిస్థితి గడచిన రెండేళ్ల పైచిలుకు కాలంలో అత్యంత దయనీయంగా మారింది. ఇటు వ్యవసాయం ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. అటు రైతుకు రాబడి ఇంతకు ముందు కంటే బాగా తగ్గిపోయింది. ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు మేలు చేసే సంకల్పంతో రేపటి నుంచి మూడు రోజులపాటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నేను రైతు దీక్ష చేపడుతున్నాను. ఈ దీక్షకు మద్దతు పలకాలని, దీనికి రాజకీయాల రంగు పులిమి ఆటంకాలు కల్పించవద్దని మనవి చేస్తున్నాను.

గత రెండేళ్లుగా వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో మనందరం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు మూడింతలయ్యాయి. రాబడులు మూడో వంతు కన్నా పడిపోయాయి. దానికి తోడు కరువు, తుపాన్‌లు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నదాత రోడ్డున పడ్డ పరిస్థితి. వ్యవసాయం చేసుకోవటం కంటే ఉరేసుకోవడం మేలన్న నానుడి జన జీవితంలోకి వచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ సాగు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ర్టంలో రైతు క్రాప్ హాలిడే ప్రకటించాడు. సమ్మె చేస్తున్నాడు. ైరైతు మీదే ఆధారపడ్డ కూలీలు పొట్ట చేతబట్టుకొని మళ్లీ వలసల బాట పట్టాల్సిన దుర్భర స్థితి. ఈ పరిస్థితి మారాలని, ైరైతును నిలబెట్టాలని, మద్దతు ధర పెంచాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలని, అస్తవ్యస్త కరెంటు విధానంలో మార్పు రావాలని, నష్టపోయిన ైరైతుకు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఆందోళనలు, దీక్షలు నిర్వహించాం. రాష్ట్రంలో రైతు, రైతాంగ సమస్యల మీద మా పోరాటం నిరంతరంగా కొనసాగుతోంది. విజయవాడలో లక్ష్య దీక్ష, ఢిల్లీలో జల దీక్ష, రావులపాలెం నుంచి పోలవరం వరకు హరితయాత్ర, గుంటూరులో రైతు దీక్ష, చిత్తూరులో సాగు పోరు, విజయవాడలో మహా ధర్నా, రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడులు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసినదే.

ఇప్పుడు ఆర్మూరులో ఈ దీక్ష... రైతు తరఫున అలుపెరుగని మా పోరాటంలో భాగం మాత్రమే. మా మనసుల్లో ఎలాంటి కల్మషాలూ లేకుండా అన్నదాతకు మేమిస్తున్న మద్దతులో ఇది భాగం. మా గుండెల్లో నిండుగా ఉన్న రైతు, రైతు కూలి పక్షపాతానికి ఇది నిదర్శనం. తెలంగాణ కోసం రాజీనామా చేసినవారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు. వారు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు కాబట్టి, వారిని గౌరవించాలన్నది, వారు ఏ పార్టీ తరఫున రంగంలోకి దిగినా ఉప ఎన్నికల్లో పోటీ పెట్టరాదన్నది ఇప్పటికే మా పార్టీ స్పష్టంగా ప్రకటించిన నిర్ణయం. కాబట్టి ఈ రైతు దీక్ష ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నమనే అవకాశమే లేదు. మరోవంక సార్వత్రిక ఎన్నికలు దరిదాపుల్లో లేవు. వాటికింకో రెండున్నరేళ్ల సమయముంది. కాబట్టి ఇప్పుడు ఆర్మూరులో మేం చేస్తున్న దీక్షకు వాటితో కూడా నిమిత్తం లేదు.

అలాంటి రాజకీయ దురుద్దేశాలు, అధికార ఆకాంక్షలు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిగారి నడకలో, నడతలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఏదో ఒక జిల్లాను ఎంచుకుని.. తన శరీరానికి వ్యాయామంగా ఉపయోగపడుతుందన్నట్టు అప్పుడప్పుడూ ఆయన రోజుకో పదిహేను కిలోమీటర్లు నడిచి.. తెలంగాణలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం.. అధికారం కోసం.. రైతుకు, వ్యవసాయానికి వ్యతిరేకి అయిన చంద్రబాబు నిన్నగాక మొన్న తెలంగాణలో దండయాత్రకు దిగారు. ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనుకుంటే ఆయన ఏమైనా చెబుతారు. అంతెందుకు.. ఈ చంద్రబాబు నాయుడే కదా.. 2009 సార్వత్రిక ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని, తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటన చేసి, తరవాత ప్లేటు ఫిరాయించిన పెద్దమనిషి. ఈ చంద్రబాబు నాయుడే కదా తన తొమ్మిదేళ్ళ పాలనలో రైతును, రాష్ట్రాన్ని నిప్పుల్లో నడిపించినది. ఈ చంద్రబాబు నాయుడి పాలనలోనే కదా ఆంధ్రప్రదేశ్ అంటే రైతుల ఆత్మహత్యలకు మారుపేరని దేశ విదేశాల్లో కూడా అప్రతిష్ట మూటగట్టుకున్నది. ఈ చంద్రబాబు నాయుడే కదా ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకునే దండేల్లా మారతాయని సిద్ధాంతం చెప్పినది. ఈయనే కదా వ్యవసాయ విద్యుత్తు చార్జీలను హార్స్‌పవర్‌కు రూ.50 నుంచి రూ.625కు పెంచినది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ను అవహేళన చేస్తూ... అలాగైతే రైతులు క్యూలు కడతారన్నది ఈయనే కదా. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర కేవలం రూ.160. మరోవంక బీటీ విత్తనాలకు రైతు చెల్లించాల్సింది ఇంతలంతలై రూ.1,800కు చేరింది. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే కదా!

మా అభిప్రాయం ప్రకారం రైతుకు కులం, మతం, ప్రాంతం, వర్గమంటూ ఉండవు. రైతుకు జరుగుతున్న అన్యాయానికి కూడా ప్రాంతీయ భేదాలు లేవు. నిజామాబాద్‌లోనైనా, గుంటూరులోనైనా పసుపు కొనుగోలు ధరలు దారుణంగా తగ్గి, పండించిన రైతుకు దిగాలు తప్పటం లేదు. మెదక్‌లోనైనా, కడపలోనైనా ఉల్లి రైతుకు కేజీకి లభించేది రెండు రూపాయలకు మించడం లేదు. కరీంనగర్‌లోనైనా, కృష్ణా జిల్లాలో అయినా వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.750 మించి అన్నదాత చేతికి అందడం లేదు. పత్తికి క్వింటాలుకు రూ.3,500 కూడా దక్కడం లేదు. చెరుకు రైతుకు టన్నుకు రూ.2,500 కూడా లభించడం లేదు. టమాటా రైతుకు దక్కుతున్నది కిలోకు 50 పైసలు మాత్రమే. నకిలీ విత్తనాలు, ఎడతెగని విద్యుత్ కోతలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రైతాంగానికి గుండెకోతను మిగులుస్తున్నాయి. వర్షాలు పడక రాష్ట్రం మొత్తంమీద 1,076 మండలాల్లో 876 మండలాలు కరువు తీవ్రతకు చిగురుటాకుల్లా వణుకుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. ఇంతటి దుర్భరమైన కరువు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నా.. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న సమ్మెకు దిగినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రే లేడు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీసీ నియామకం జరగలేదు. వ్యవసాయ టెక్నాలజీ మిషన్‌కు ఏమయిందో ఎవరికీ తెలియదు. ఇంతకు మించిన దుస్థితి ఏముంది? అందుకే, పేదలకు, రైతుకు మద్దతు పలికే సభ్యులు.. విలువల కోసం, విశ్వసనీయత కోసం పార్టీ గీతలు చెరిపేసి, ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించిన అరుదైన ఘట్టం ఇటీవలే శాసనసభలో చోటుచేసుకుంది. ఎన్నిరకాల ఇబ్బందులూ, బెదిరింపులూ ఎదురైనా, శాసనసభ్యత్వం రద్దు కాబోతోందని తెలిసినా.. రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి అరిష్టం అని భావించి, రైతుల కోసం, పేదవాడి కోసం, విలువల కోసం, విశ్వసనీయత కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి అపూర్వ త్యాగనిరతిని చాటిన విషయం మీరంతా గమనించారు. అందులో భాగంగానే తెలంగాణ రైతు దుస్థితికి నిరసనగా సురేఖమ్మ రాజీనామా సమర్పించారు.

ఇలాంటి సమయంలోనూ రైతు సమస్యల పరిష్కారానికి మేం ఉద్యమమే చేయకూడదనే వాదనలు వింటున్నప్పుడు... అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదన్న సామెత గుర్తుకు వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చి మన రైతన్నని, అతడి మీద ఆధారపడిన వ్యవసాయాన్ని, గ్రామాల్ని, మొత్తంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని బతికించుకోవాల్సిన పరిస్థితిలో.. అలాంటి ప్రయత్నాల ధ్యాసే లేని ప్రభుత్వం, దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలు ఆర్మూరులో నా దీక్షను వ్యతిరేకించటమే విచిత్రం.

పార్టీగా, వ్యక్తిగా తెలంగాణకు సంబంధించి మా అభిప్రాయాలను నిరుడు జూలైలో మా పార్టీ మొట్టమొదటి ప్లీనరీలోనే అనుమానాలకు అతీతంగా ప్రకటించాం. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం తీసుకునేందుకు గానీ, ఆపేందుకు గానీ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే చూడండి. తమ రాష్ట్రాన్ని నాలుగుగా విభజించండని సాక్షాత్తు ఆ రాష్ట్ర అసెంబ్లీ చేత ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి ఒక తీర్మానాన్ని ఆమోదింపజేసి పంపితే.. దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. ఇది జరిగి నెల కూడా కాలేదు. కాబట్టి నిర్ణయం తీసుకోగలిగినది ఎవరో, ఆపగలిగిందెవరో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక మా నిర్ణయంలో ఎలాంటి సందిగ్ధతా లేదు. తెలంగాణ ఆకాంక్షను మేం గౌరవిస్తున్నామని, తెలంగాణను ఇచ్చేందుకు గానీ, ఆపేందుకు గానీ మాకు శక్తి లేదని మా పార్టీ ప్లీనరీలోనే ప్రకటించాం. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చవద్దని, ఎవరి ప్రయోజనాలూ దెబ్బతినకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా, న్యాయబద్ధంగా సత్వరం నిర్ణయం తీసుకుని ఏ విషయమూ తేల్చండని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాం. ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగానూ మా పార్టీ విధానమేమిటో విస్పష్టంగా వివరించాం. విచిత్రమేమిటంటే, అలా నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఎలాంటి ఆటంకాలూ అవరోధాలూ లేకుండానే సంచరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ, నిర్ణయాధికారమున్న కాంగ్రెస్ వారంతా ఆ సంగతి వదిలేసి తెలంగాణలో తిరుగుతున్నప్పుడు మిగతా పార్టీల వారిని అడ్డుకోవటం ఏమిటన్నది సూటిగా నా ప్రశ్న.

మాది రైతు దీక్ష. రాష్ట్రవ్యాప్తంగా కుప్పకూలిపోతున్న రైతును, రైతు కూలీని, రైతాంగాన్ని, మొత్తంగా ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర సర్కారుకు, దాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్న పెద్దలకు కనువిప్పు కలిగించేందుకే ఈ మా ప్రజాస్వామ్యబద్ధ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడికి మాదిరి ప్రభుత్వ ఆదేశాల మేరకు పదివేల మంది పోలీసులు అటూ ఇటూ రక్షణగా నిలబడే అవకాశం మాకు లేదు. ఇందుకోసం మేం చంద్రబాబు నాయుడు మాదిరి పాలక పక్షంతో కుమ్మక్కు కాలేదు. మాది ధర్మయుద్ధం. మాది ప్రజల తరఫున పోరాటం. మాది రైతు కోసం దీక్ష. మేం ప్రజల పక్షం. రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే వారంతా మాకు సహకరించాలని, మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం’’

English summary
Full text of YSR Congress president YS Jagan's open letter to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X