నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ రైతు దీక్ష: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమోనని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కళ్లు తెరిచేలా చేస్తుందేమోనని తాము రైతుల కోసం డిమాండ్లు పెడుతున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. తన మూడు రోజుల రైతు దీక్షను విరమిస్తూ ఆయన గురువారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ప్రసంగించారు. మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని రైతుల కోసం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కరవు మండలాల్లోని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు కదిలి వస్తారేమోననే ఆశతో ఈ డిమాండ్లు పెడుతున్నానని ఆయన అన్నారు.

గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టులు మీ నాన్న మాకిచ్చాడని రైతలు తనతో చెప్పారని, గుత్పా ప్రాజెక్టు నుంచి తమకు నీళ్లు ఇచ్చాడని చెప్పారని ఆయన అన్నారు. రైతుల సమస్యలను వైయస్ రాజశేఖర రెడ్డి అర్థం చేసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల గురించి మరిచిపోలేదని, ప్రతిపక్షంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డివిలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పారని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. రైతులకు ప్రాంతాలు, కులాలు, మతాలు లేవని, ఉన్నది ఆకలి మాత్రమేనని, పెట్టుబడులు విపరీతంగా పెట్టారని, పసుపు పంటకు మరింత ఎక్కువగా పెట్టారని ఆయన అన్నారు. పసుపు పంట వేసి రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. దారుణమైన పరిస్థితిలో పసుపు రైతు కనిపిస్తున్నాడని, వరి వేసిన రైతుల పరిస్థితి కూడా దారుణంగానే ఉందని ఆయన అన్నారు. ఉల్లి వేసుకుంటున్న రైతు నుంచి టొమాటో వేసిన రైతు నుంచి ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడం మేలుగా ఉందని బాధపడుతున్నారని ఆయన అన్నారు. పంట వచ్చే సమయానికి ధర తగ్గిపోతుందని, దాంతో అప్పులే మిగులుతున్నాయని ఆయన అన్నారు. వ్యాపారుల చేతికి పంట వెళ్లిపోయిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఎరువుల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ఎరువుల ధరలు పెరిగిన తీరును ఆయన వివరించారు. కూలీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని, రైతుల పరిస్థితే బాగా లేనప్పుడు తమకేమీ ఇవ్వగలుగుతారని కూలీలు అంటున్నారని ఆయన అన్నారు. మొట్టమొదటిసారిగా రైతులంతా క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి ఉందని, ఇది మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందరినీ గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా బుద్ధొచ్చే విధంగా దీక్షలు చేశామని, ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినా ప్రభుత్వం రైతు పక్షాన లేదనే మాట రుజువైందని, చెవిటి వాడి ముందు శంఖమూదినట్లు ఉందని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత అనే అర్థం తెలియడం లేదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా, ప్రతిపక్షంలో మరో విధంగా వ్యవహరిస్తున్నాడని, చంద్రబాబు హామీలు మర్చిపోయి దిగజారుడుతో వ్యవహరిస్తారని, రైతులపై ప్రేమతో చంద్రబాబు వ్యవహరించడం లేదని, తనకేమిటనే ఆలోచనతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు 9 గంటలు కరెంట్ ఇస్తానని హామీ ఇస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ బిల్లు చెల్లించకపోతే వారంట్ కూడా లేకుండా రైతులను అరెస్టు చేయాలని జీవో జారీ చేశారని, వారికి జైలు శిక్ష విధించాలని అందులో పేర్కొన్నారని ఆయన అన్నారు. కరెంట్ బిల్లులు చెల్లించనివారికి శిక్షలు వేసేందుకు ప్రత్యేకంగా కోర్టులు పెడుతూ మరో జీవో జారీ చేశారని ఆయన అన్నారు. ఉచితంగా కరెంట్ ఇస్తామని వైయస్ హామీ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తీగలు పనికి వస్తాయని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. ఐదేళ్ల పాటు వైయస్ ఉచిత విద్యుత్తును అందించిన తర్వాత తాను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. విలువలు, విశ్వసనీయత, నిబద్ధత లేకుండా చంద్రబాబు మారిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ఫలానావాడు తమ నాయకుడని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకోగలగలాని, తమది ఫలానా పార్టీ అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకోగలగాలని ఆయన అన్నారు.

రైతులు, పేదల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న సమయంలో 17 మంది శాసనసభ్యులు విలువల కోసం నిలబడ్డారని, ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, చంద్రబాబు దురుద్దేశ్యపూర్వకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా మనం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందేనని చెప్పానని, వారు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. ఆ రోజు శాసనసభ్యులు భయపడిన మాట నిజమేనని, కోట్లు కురిపిస్తారని, మంత్రులు మకాం వేస్తారని, ఆ సీట్లలో తిరిగి గెలువగలుగుతామా అని భయపడ్డారని, రైతుల కోసమూ పేదల కోసమూ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయని తాను చెప్పానని, విలువలనూ విశ్వసనీయతనూ నిలబెట్టడానికి వారు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan lashed out at state government for veglecting farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X