ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సీక్రెట్ ఏజెన్సీలు ఇవే..!
ఆధునిక ప్రపంచంలో ఆయుధాల కంటే సమాచారమే అత్యంత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థల పాత్ర కీలకమవుతోంది. అగ్రరాజ్యాల వెనుక నిరంతరం పనిచేసే ఒక అదృశ్య శక్తి ఈ గూఢచార సంస్థలే. సామాన్య ప్రజలకు తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని సేకరిస్తూ, ముప్పులను ట్రాక్ చేస్తూ, తమ దేశ ప్రయోజనాలను కాపాడటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాల కీలక నిర్ణయాల వెనుక వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అమెరికాకు చెందిన సీఐఏ (CIA), బ్రిటన్ ఎంఐ6 (MI6), ఇజ్రాయెల్ మొస్సాద్ (Mossad) వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే, రష్యా ఎఫ్ఎస్బీ (FSB), భారత్ 'రా' (RAW), చైనా ఎంఎస్ఎస్ (MSS), పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI), ఫ్రాన్స్ డీజీఎస్ఈ (DGSE) వంటి గూఢచార సంస్థలు తెరవెనుక వ్యూహాలను రూపొందిస్తున్నాయి. వీటిలో ఇజ్రాయెల్ మొస్సాద్ అత్యంత శక్తిమంతమైన గూఢచార సంస్థగా గుర్తింపు పొందింది.

మొస్సాద్ ఏజెంట్లు ఒకే ప్రాంతంలో 20-30 సంవత్సరాల పాటు నిఘా నిర్వహిస్తారు. వారిపై అనుమానం రావడం దాదాపు అసాధ్యం. ఇక, అమెరికా సీఐఏ పనితీరు మరోరకంగా ఉంటుంది. ఇది సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తుంది. ఆయా దేశాల పౌరులనే గూఢచారిగా నియమించుకుని, వారి ద్వారానే సమాచారాన్ని సేకరించడంలో సీఐఏ ముందుంటుంది. రష్యాకు చెందిన ఎఫ్ఎస్‌బీ పనితీరు విభిన్నం. ఎఫ్‌ఎస్‌బీ అధికారులు ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడంలో దిట్టలు. వీరు ఏ దేశం నుంచి సమాచారం కావాలో, ఆ దేశంలోని అధికారుల నుంచే రహస్యంగా సేకరిస్తారు.
కేవలం సరిహద్దుల భద్రతకే పరిమితం కాకుండా, ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉగ్రవాద నిర్మూలన, సైబర్ దాడుల నివారణ, భౌగోళిక రాజకీయాల్లో తమ దేశాల ప్రభావాన్ని పెంచడం వంటి ఎన్నో క్లిష్టమైన బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. విదేశీ ప్రభుత్వాల కదలికలను విశ్లేషించడం, సెక్యూరిటీ రిస్క్‌లను అంచనా వేయడం నుంచి మిలిటరీ ఆపరేషన్‌లకు మద్దతు ఇవ్వడం వరకు అన్నీ ప్రజలకు కనిపించకుండానే అత్యంత రహస్యంగా సాగుతాయి.
నేటి ఆధునిక ప్రపంచంలో గూఢచర్యం అంటే కేవలం చీకట్లో తిరిగి సమాచారం సేకరించడం మాత్రమే కాదు. ఎవరి దగ్గర ముందస్తు సమాచారం ఉంటే వారే ఈ సమాచార యుద్ధంలో విజేతలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సమాచారాన్ని వేగంగా సేకరించడం, దాన్ని ఎంత త్వరగా ధృవీకరించుకోవడం, ఇతరుల కంటే ముందే సరైన సమయంలో దాన్ని ఉపయోగించుకోవడం చాలా కీలకం. ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో ప్రభుత్వాలు యుద్ధాలను అర్థం చేసుకోవాలన్నా, వాటిని ఎదుర్కోవాలన్నా ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రధాన ఆధారం. రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంలో ఈ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి.
కొన్ని సంస్థలు కేవలం విదేశీ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెడితే, మరికొన్ని అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్‌ను పర్యవేక్షిస్తాయి. సైబర్ వార్‌ఫేర్ ద్వారా నెట్‌వర్క్‌లను గుప్పిట్లో పెట్టుకోవడం, ఎన్‌క్రిప్టెడ్ సిస్టమ్స్ ద్వారా రహస్య గదుల్లో జరిగే ఈ ఆపరేషన్‌ల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదు. ఆయుధాల కన్నా సమాచారమే అత్యంత విలువైన ఆయుధంగా మారుతున్న నేటి హైటెక్ ప్రపంచంలో ఈ రహస్య సంస్థలే దేశాలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. ముందు ముందు ఈ సమాచార యుద్ధంలో ఇంకెన్ని సంచలనాలు నమోదు కానున్నాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications