ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, వీరికి మినహా - చంద్రబాబు కీలక నిర్ణయాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని తాజాగా చేసిన పొదుపు వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ తమ సెక్యూరిటీ వాహనాలను 50 శాతం కుదించారు. ప్రభుత్వంలోనూ ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులకూ స్పష్టత ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలుకు నిర్ణయించారు. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయానికి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో వర్క్ ఫ్రం హోం అమలు ప్రభుత్వ ఉద్యోగులతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోంతో పాటు హైబ్రిడ్ విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లకూ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గిద్దామని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించగా.. సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ సైతం తన కాన్వాయ్‌ను సగానికి కుదిస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారు లు వాహనాలను సగానికి తగ్గించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. తప్పనిసరిగా భౌతికంగా కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు.. ఇంటి నుంచి కూడా పనిచేసేందుకు వీలున్న ఉద్యోగులు ఎవరెవరన్నది విభజించేలా కసరత్తు జరుగుతోంది. వీలున్న వారికి వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయడంతో పాటు ఒకరోజు ఇంటి నుంచి, మరో రోజు ఆఫీసుకు వచ్చి పని చేసేలా హైబ్రిడ్ విధానాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అధికారులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదని, దీంతో ఇంధన వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు (గురువారం) జరిగే క్యాబినెట్ భేటీలో పొదుపు అంశాలు, వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించిన తర్వాత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు. తన కాన్వాయ్‌లోని వాహనాలను కుదించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనల్లో కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు సూచించారు.మరిన్ని కీలక విధాన నిర్ణయాలు క్యాబినెట్‌లో చర్చించి ప్రకటించనున్నారు.













Click it and Unblock the Notifications